పోక్సో కేసు పెట్టారనే కక్ష.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురిని హత్య చేసిన ఉన్మాది
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, దైవాలగూడలో మానవత్వానికే మచ్చ తెచ్చేలా అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది.
By: A.N.Kumar | 11 July 2026 11:32 AM ISTరంగారెడ్డి జిల్లాలోని షాబాద్, దైవాలగూడలో మానవత్వానికే మచ్చ తెచ్చేలా అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తనపై పోక్సో కేసు నమోదైందనే కక్షతో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. ఒకే రాత్రిలో ఏకంగా ఆరుగురిని కిరాతకంగా నరికి చంపిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. మృతుల్లో నిందితుడి భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అసలు ఏం జరిగింది? కేసు నేపథ్యం ఇదే..
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన అతడు ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. తన జీవితం నాశనమవడానికి ఆ బాలిక కుటుంబమే కారణమని మనసులో తీవ్ర ప్రతీకారేచ్ఛను పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని పథకం పన్నాడు.
వరుస హత్యలతో రక్తసిక్తమైన గ్రామం
అనుకున్నదే తడవుగా నిందితుడు రాత్రి సమయంలో సదరు బాలిక ఇంటిపై దాడికి తెగబడ్డాడు. కక్షతో రగిలిపోతూ ఇంట్లోకి చొరబడి బాలిక తల్లి, నానమ్మలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడికక్కడే హతమార్చాడు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా భయంతో వణికిపోతున్న బాలికను బలవంతంగా అక్కడి నుంచి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడి ఆపై ఊపిరి లేకుండా చేసి కిరాతకంగా చంపేశాడు.
బాధిత కుటుంబంపై పగ తీర్చుకున్న తర్వాత నిందితుడిలోని ఉన్మాదం చల్లారలేదు. నేరుగా తన ఇంటికి వెళ్లిన అతడు, తన భార్యతో పాటు కన్నబిడ్డలని కూడా చూడకుండా ఇద్దరు అమాయక చిన్నారులను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
ఫోన్ చేసి చెప్పడంతో వెలుగులోకి..
ఆరుగురిని పొట్టనబెట్టుకున్న అనంతరం నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చేసిన ఘోరాన్ని వివరించాడు. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించి నివ్వెరపోయారు. ఘటనా స్థలాల నుంచి క్లూస్ టీమ్ కీలక ఆధారాలను సేకరించింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. అయితే నిందితుడు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక పారిపోయాడా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
గతంలో నిందితుడు పెద్ద ఎత్తున ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 2 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి నష్టపోయినట్లు గుర్తించారు. గతంలో కూడా నిందితుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
ఒక పోక్సో కేసు తెచ్చిన కక్ష.. చివరకు ఆరుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ ఉన్మాదిని వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని బాధితుల బంధువులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
