భార్యను చంపి, మృతదేహంతో సెల్ఫీ వాట్సప్ స్టేటస్.. ఎవరీ బాలమురుగున్..!
వివరాళ్లోకి వెళ్తే... కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న శ్రీప్రియ.. తన భర్త బాలమురుగన్ నుంచి విడిపోయింది.
By: Raja Ch | 1 Dec 2025 9:56 AM ISTఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రతీ సమస్యకూ పరిష్కారం హత్య, ఆత్మహత్య అని చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో తాజా ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఇందులో భాగంగా... ఓ వ్యక్తి తన భార్యను నరికి చంపి, ఆ మృతదేహంతో సెల్ఫీ దిగాడు. అనంతరం.. ఆ సెల్ఫీని వాట్సప్ లో స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... ఇటీవల కాలంలో భర్తలను చంపుతున్న భార్యలు, భార్యలను కడతేరుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సమాజం, దాంపత్య బంధం అనేవి ఎటువైపు పోతున్నాయనే ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన తాజా ఘోర ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న శ్రీప్రియ.. తన భర్త బాలమురుగన్ నుంచి విడిపోయింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆమెను కలవడానికి తన బట్టలలో కొడవలి దాచుకుని హాస్టల్ కు వచ్చాడు. ఈ సమయంలో వారిద్దరూ కలుసుకున్న తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ సమయంలో అతడు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు.
ఇందులో భాగంగా... బాలమురుగన్ కొడవలి తీసి, హాస్టల్ లో ఆమెను నరికి చంపాడని ఆరోపించారు! అనంతరం.. ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకుని, దానిని వాట్సప్ స్టేటస్ గా అప్ లోడ్ చేశాడని చెబుతున్నారు. ఈఘోర నిర్ణయానికి కారణం.. ఆమె తనకు ద్రోహం చేసిందని పేర్కొంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడి జరిగిన సమయంలో హాస్టల్ లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయానికి అక్కడే ఉన్న అతడిని అరెస్ట్ చేసి, ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా... అతను తన భార్యకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని అనుమానిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అంటున్నారు.
మరోవైపు ఈ హత్య పై విపక్షాలు.. అధికార డీఎంకేపై విమర్శలు ఎక్కు పెట్టడానికి ఉపయోగించాయి! ఇందులో భాగంగా.. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే.. ఇవి వ్యక్తిగత శతృత్వంతో నడిచే యాదృచ్ఛిక సంఘటలని రాష్ట్ర పోలీసులు వాదిస్తున్నారు!
