Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ విలన్.. తహసీల్దార్ రమణయ్య హ్యత్యకేసులో కీలక నిందితుడు

ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతనికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Feb 2024 3:53 AM GMT
వెబ్ సిరీస్ విలన్.. తహసీల్దార్ రమణయ్య హ్యత్యకేసులో కీలక నిందితుడు
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది విశాఖపట్నంలోని తహసీల్దారు రమణయ్య హత్యోదంతం. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మురారి సుబ్రహ్మణం గంగారావు జీవితంలోని చీకటి కోణాల్ని గుర్తించారు. అతడి బ్యాక్ గ్రౌండ్ గురించి చెక్ చేస్తే పలు అనుమానాస్పద ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతనికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి.

తానే నిర్మాతగా మురారి ఒక వెబ్ సిరీస్ ను నిర్మించాడు. అందులో తానే విలన్ గా నటించాడు. రెండు ఎపిసోడ్ లు మాత్రమే ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీకి అమ్మే ప్రయత్నం చేస్తే.. అందులో హింస మోతాదు మించిన రీతిలో ఉందన్న అభ్యంతరాలతో ఓకే చెప్పలేదంటున్నారు. ఇతడిపై రెండు మోసం కేసులు ఉన్నాయని.. హైదరాబాద్ , విజయవాడ పరిధిలో అతనిపై రెండు కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు రూ.2.50 కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

సినిమాలు నిర్మించాలన్న ఇష్టంతో మూడేళ్ల క్రితం ''ది నైట్’’ పేరుతో రెండు ఎపిసోడ్లు ఉన్న వెబ్ సిరీస్ ను తీశాడు. దీని దర్శకుడికి డబ్బులు ఇవ్వకపోవటంతో అతను వెళ్లిపోయాడు. దీంతో తానే దర్శకత్వ బాధ్యతలతో పాటు విలన్ పాత్రను పోషించాడు. ఈ వెబ్ సిరీస్ లోనూ ఒక యువతి తల మీద రాడ్ తో కొట్టి చంపేస్తాడు. తాజాగా తహసీల్దారు రమణయ్య హత్య కేసులోనూ ఇనుప రాడ్ తో తల మీద కొట్టి హత్య చేసిన వైనం తెలిసిందే.

కన్వేయెన్స్ డీడ్ ఇష్యూలో నిందితుడు మురారికి.. తహసీల్దారుకు మధ్య జరిగిన లావాదేవీలను పోలీసులు గుర్తించారు. నిందితుడు ఒక నిర్మాణ సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్నట్లు చెప్పిన పోలీసు ఉన్నతాధికారి సదరు సంస్థ పేరును 'వి’ అని చెప్పి ఆపేయటం గమనార్హం. ఈ కంపెనీకి సంబంధించి విశాఖలోని మధురవాడలో ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టిందని.. అందులోని డి బ్లాక్ లో మురారి ఉంటున్నాడని తేలింది.

ఇదే ప్రాజెక్టు స్థలం కన్వెయెన్స్ డీడ్ ఇష్యూలో భాగంగా తహసీల్దారు రమణయ్యను పలుమార్లు కలిశాడు మరారి. తాజాగా మురారిని కోర్టు ఎదుట పోలీసులు హాజరుపర్చగా.. రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు హాజరు పర్చటానికి ముందుగా పోలీసులు విచారించగా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు. అతడి గతం మీద పోలీసులు మరింత ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.