Begin typing your search above and press return to search.

చోరీ చేసిందంటూ తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు

ఇలా ఉంటే.. చిన్న కుమారుడి పెరట్లో పెంచుతున్న క్యాబేజీని ఎవరో దొంగతనం చేశారు. అది చేసింది తన తల్లేనంటూ చిన్న కొడుకు అనుమానించాడు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:41 AM GMT
చోరీ చేసిందంటూ తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొడుకు
X

కొన్ని ఉదంతాల గురించి తెలుసుకోకపోతేనే బాగుంటుంది. కానీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలాంటివి తెలియటం ద్వారా.. మానవత్వం లేని మనషులు మన చుట్టూ ఉన్నారని.. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు.. మిగిలిన వారికి పాఠాలుగా చూపించి.. అలాంటి దుర్మార్గం అస్సలు వద్దని చెప్పాలనిపిస్తుంది. తాజాగా వెలుగు చూసిన దారుణం ఆ కోవకు చెందిందే. కన్నతల్లి మీద దొంగతనం ఆరోపణలు వేసి.. ఆమెను దారుణంగా హింసించిన కొడుు గురించి తెలిస్తే రక్తం మరిగిపోవటమే కాదు.. అలాంటోడికి ఎలాంటి శిక్ష విధించినా తప్పు లేదనిపించకమానదు. ఒడిశాలో వెలుగు చూసిన ఈ అమానుష ఘటనలోకి వెళితే..

బాల్యంలో అల్లారుముద్దుగా పెంచిన తల్లిని ఆమె పెద్దయ్యాక ఎలా చూసుకోవాలి. బాల్యంలో పిల్లలు తప్పులు చేస్తే.. వాటిని చూసి మురిసిపోయి.. అలా చేయొద్దు కన్నా అంటూ బుజ్జగిస్తుందే తప్పించి.. అమానుషంగా ప్రవర్తించదు.కానీ.. ఈ కొడుకు అందుకు భిన్నం. ఒడిశాలోని కేరంషుర్ జిల్లాలో శరషపాషి పేరుతో ఒక గ్రామం ఉంది. అక్కడ 70 ఏళ్ల సుభద్ర మహంతి నివసిస్తుంటారు. ఆమెకు భర్త.. ఇద్దరు కొడుకులు.

అయితే.. పదేళ్ల క్రితమే భర్త భూతుర తురామ్ మహంతి కాలం చేశాడు. ఆమె పెద్ద కొడుకు కూడా కొన్నాళ్ల క్రితం మరణించాడు. ఇలాంటి వేళ చిన్న కొడుకు వేరే కాపురం పెట్టాడు. దీంతో.. పెద్ద కోడలుతో కలిసి ఆమె ఉంటున్నారు. ఇలా ఉంటే.. చిన్న కుమారుడి పెరట్లో పెంచుతున్న క్యాబేజీని ఎవరో దొంగతనం చేశారు. అది చేసింది తన తల్లేనంటూ చిన్న కొడుకు అనుమానించాడు.

ఆ విషయం మీద ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. తాను ఆ దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా కొడుకు కనికరించలేదు. రెండు రోజులుగా కొట్టసాగాడు. శనివారం మరింత పైశాచికంగా మారి.. ఆమెను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి.. విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న కోడలు ఆసుపత్రికి వెళ్లి.. అత్తమీద మరోసారి దాడి చేసింది. ఈ సమయంలో వైద్య సిబ్బందిని సుబద్రను కాపాడారు.

కరెంటు స్తంభానికి కట్టేసి తల్లిని కొట్టి.. హింసించిన ఉదంతంలో చిన్న కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ఎదుట హాజరపర్చగా.. బెయిల్ లభించలేదు. దీంతో అతడ్ని రిమాండ్ కు తరలించారు. మరోవైపు కొడుకు హింస కారణంగా ఆ తల్లి ఇప్పుడు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపగా.. రాష్ట్రంలో ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.