Begin typing your search above and press return to search.

2 ఏళ్ల క్రితం రూ200 కోసం గొడవ కట్ చేస్తే తాజా విషాదం!

రెండేళ్ల క్రితం హైదరాబాద్ మహానగర శివారులో జరిగిన ఒక గొడవ.. ఒక యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 10:32 AM IST
2 ఏళ్ల క్రితం రూ200 కోసం గొడవ కట్ చేస్తే తాజా విషాదం!
X

రెండేళ్ల క్రితం హైదరాబాద్ మహానగర శివారులో జరిగిన ఒక గొడవ.. ఒక యువకుడి ప్రాణాలు పోయేలా చేసింది. కష్టపడి చదువుతూ.. ఎస్ఐ కావాలన్న కలను నెరవేర్చుకునే క్రమంలో రాత్రిళ్లు క్యాబ్ డ్రైవర్ గా పని చేయటమే శాఫమైంది. తనకు రావాల్సిన రూ.200లను అడగటమే అతడికి పాపమైంది. ఒక కుటుంబం దారుణంగా దెబ్బ తినటమే కాదు.. చివరకు ఆ యువకుడు తాజాగా ప్రాణాలు పోగొట్టుకున్న వైనం గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదు. అతడ్ని బతికించుకోవటానికి.. బాగు చేసుకోవటానికి అతడి కుటుంబం ఆస్తులు అమ్మి.. అప్పులు చేసి రూ.కోటి వరకు ఖర్చు చేసినా చివరకు ప్రాణం దక్కని విషాద ఉదంతం. అసలేం జరిగిందంటే..

2022 జులై31న రాత్రి 11 గంటల వేళలో వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో బీఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పర్ పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యానికి చేరుకున్న తర్వాత క్యాబ్ డ్రైవర్ కు రూ.900 ఇవ్వాల్సి వచ్చింది. కానీ.. వివేక్ రెడ్డి రూ.700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ.200 ఇవ్వలేదు. దీంతో క్యాబ్ డ్రైవర్ 27 ఏళ్ల వెంకటేశ్ గౌడ్ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ గట్టిగా అడిగాడు. దీంతో వాగ్వాదం మొదలైంది.

అతనికి ఇవ్వాల్సిన రూ.200 ఇవ్వని వివేక్ రెడ్డి కోపంతో స్నేహితులకు ఫోన్ చేశాడు. మద్యం తాగుతున్న వారు.. అలానే ఇరవై మంది వరకు వచ్చి క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ గౌడ్ మీద దాడికి దిగారు. క్రికెట్ బ్యాట్లు.. వికెట్ కర్రలతో అతడ్ని చితక్కొట్టారు. ప్రాణభయంతో పారిపోతుంటే.. పట్టుకొని చితకబాదారు. దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా హింసించి.. తమ బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ రాజేంద్రనగర్ పోలీసులకు అప్పజెప్పారు.

తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించాల్సిన పోలీసులు.. అతడ్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. దాడి చేసిన వారిని మాత్రం వదిలేశారు. దారుణంగా తగిలిన దెబ్బలతో ఉన్న వెంకటేశ్ ను అలానే వదిలేశారు. మర్నాడు గాయాల తీవ్రత పెరగటం.. అతడి పరిస్థితి విషమించటంతో అప్పుడు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కు చేరుకున్న కాసేపటికే అతడు కోమాలోకి వెళ్లిపోయాడు.

ఈ గొడవ మొత్తం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. కొద్దిరోజులకే వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన సన్నకారు రైతు కుటుంబానికి చెందిన వెంకటేశ్ డిగ్రీ వరకు చదివారు. పాకెట్ మనీ కోసం రాత్రిళ్లు క్యాబ్ నడిపే అతడికి ఇలాంటి దుస్థితి.

కొడుకును బతికించుకోవటానికి తల్లిదండ్రులు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం పొలాన్ని అమ్మేశారు. ఇంటిని తాకట్టు పెట్టారు. అప్పులు చేశారు. రెండు నెలల క్రితం ఇంటికి తీసుకెళ్లి అక్కడే చికిత్స చేస్తున్నారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించటంతో వెంకటేశ్ గౌడ్ చనిపోయాడు. కొందరు యువకుల క్షణిక ఆవేశానికి ఒక నిండు ప్రాణం బలైపోగా.. ఒక కుటుంబం ఛిన్నాభిన్నమైంది. నిందితులు ఏమయ్యారన్నది కూడా తెలీని పరిస్థితి. అయ్యో అనిపించే ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.