రోడ్డున పడున్న పసిగుడ్డును చేరదీస్తే.. 13 ఏళ్లు అయ్యాక ఆ తల్లినే...!
ఈ సందర్భంగా స్పందించిన గజపతి జిల్లా ఎస్పీ జతీంద్ర కుమార్ పాండా... రాజ్యలక్ష్మి, ఆమె భర్త సుమారు 14 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన పడి ఉన్న పసికందును కనుగొన్నారని.
By: Tupaki Desk | 17 May 2025 7:06 PM ISTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తోన్న పలు ఘటనలు "మానవత్వాన్ని" కాలర్ పట్టుకుని ప్రశ్నించడం పక్కన పెట్టి.. రోజు రోజుకీ కరిగిపోతున్న మానవత్వం వీలైనంత తొందర్లో కనుమరుగైపోతుంది అని చెప్పినా అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది! భర్తను, ప్రియుడితో కలిపి చంపి ప్లాస్టిక్ టబ్ లో వేసి, సిమెంట్ వేసి కప్పేయడం నుంచి ఎన్నో ఎన్నో ఘటనలు! ఈ క్రమంలో తాజాగా తల్లిని చంపిన కూతురి ఘటన తెరపైకి వచ్చింది!
అవును... మూడు రోజుల వయసులో ఉన్న ఓ పసిగుడ్డును రోడ్డు పక్కన వదిలివేయడంతో.. ఆమెను చూసిన ఓ మహిళ ఆ బిడ్డను దత్తత తీసుకుంది. ఇప్పటికి ఆ పసికందు వయసు 13 ఏళ్లకు చేరుకుంది. 13వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులతో కలిసి తన తల్లిని చంపేసింది ఆ బాలిక. తల్లి ఆస్తి కోసమే ఆ బాలిక, తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... ఒడిశాలోని గజపతి జిల్లాలో 13 ఏళ్ల క్రితం రోడ్డుపక్కన 3 రోజుల పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తుంది. ఆమెను కన్నవారు ఆ పసికందును అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ సమయంలో రాజ్యలక్ష్మీ కర్ అనే మహిళ.. ఆ పసికందును దగ్గరకు తీసుకుని పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆ మూడు రోజుల పసికందు ఇప్పుడు 13 ఏళ్ల బాలిక అయ్యింది. ఈ సమయంలో.. తన తల్లి ఆస్థిపై కన్నేసింది!
ఈ క్రమంలో.. తన ఇద్దరు స్నేహితులు.. ఆలయ పూజారి గణేష్ రథ్ (21), దినేష్ సాహు (20)తో కలిసి గజపతి జిల్లాలోని పర్లాఖేముండి పట్టణంలోని వారి అద్దే ఇంట్లోనే హత్యచేయడానికి కుట్ర పన్నింది. ఈ సమయంలో ఏప్రిల్ 29న రాజ్యలక్ష్మికి నిద్రమాత్రలు ఇచ్చి.. ఆ తర్వాత తలదిండుతో ఆమెకు ఊపిరాడకుండా చేశారు! అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు!
ఈ సమయంలో ఆమె బంధువులందరికీ గుండె పోటుతో మరణించిందని సమాచారం అందింది.. వారంతా చేరుకున్న అనంతరం మరుసటి రోజు భువనేశ్వర్ లోని ఆమె బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సమయంలో రాజ్యలక్ష్మి అంత్యక్రియలకు భువనేశ్వర్ వెళ్లిన ఆ అమ్మాయి.. మొబైల్ ఫోన్ ను మరిచిపోయింది. ఆ ఫోన్ రాజ్యలక్ష్మి సోదరుడు ప్రసాద్ మిశ్రా కనుగొన్న రెండు వారాల తర్వాత అసలు విషయం వెలుగుచూసింది!
ఈ సమయంలో.. ఆ ఫోన్ ను పరిశీలించినప్పుడు తన సోదరి హత్యకు జరిగిన ప్లాన్ అంతా ఇన్ స్టా గ్రామ్ మెసేజ్ లలో బయటపడిందంట. ఆ చాట్ లలో రాజ్యలక్ష్మిని చంపి, ఆమె బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు ఉన్నాయి! దీంతో.. విషయం గ్రహించిన మిశ్ర... మే 14న పర్లాకిమిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన గజపతి జిల్లా ఎస్పీ జతీంద్ర కుమార్ పాండా... రాజ్యలక్ష్మి, ఆమె భర్త సుమారు 14 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన పడి ఉన్న పసికందును కనుగొన్నారని.. పిల్లలు లేని ఆ దంపతులు ఆ బిడ్డను తమ సొంత బిడ్డలా పెంచుకున్నారని.. ఈ క్రమంలో ఒక ఏడాది క్రితం రాజ్యలక్ష్మి భర్త మరణించారని తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే అమ్మాయిని పెంచిందని తెలిపారు.
ఈ క్రమంలో... ఆమె తన కుమార్తెను కేంద్రీయ విద్యాలయంలో చదివించడానికి పర్లాకిమిడికి వెళ్లి, ఆమెను అక్కడే చేర్పించి, పట్టణంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారని తెలిపారు. కాలక్రమేణా.. ఆ అమ్మాయి తనకంటే చాలా పెద్దవాళ్లైన రత్, సాహులతో సంబంధంలోకి ప్రవేశించిందని చెప్పారు. అయితే.. ఈ విషయం రాజ్యలక్ష్మికి తెలిసి మందలించడంతో.. ముగ్గురూ కలిసి ఈ ప్లాన్ చేశారని తెలిపారు.
అయితే.. అప్పటికే పూజారి రథ్ కు ఆ అమ్మాయి.. రాజ్యలక్ష్మి ఆభరణాలు కొన్ని ఇచ్చిందని.. అతను వాటిని సుమారు రూ.2.4 లక్షలకు తాకట్టు పెట్టాడని.. ఈ సమాజంలో రాజ్యలక్ష్మి హత్యకు ఆ అమ్మాయిని ఎక్కువగా ప్రేరేపించాడని తెలిపారు. ఈ సమయంలో నిందితుడి నుంచి 30 గ్రాముల బంగారం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
