Begin typing your search above and press return to search.

మహిళను మోసం చేసి కోట్లు కొట్టేసిన 'సుప్రీంకోర్టు సీజేఐ' డూప్!

ఇటీవల కాలంలో సామాన్యుడి నుంచి పద్మభూషణ అవార్డు గ్రహీత వరకూ ఎంతో మందిని దోచుకున్న వ్యవహారం.. "డిజిటల్ అరెస్ట్" అనే సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   30 Dec 2025 4:00 AM IST
మహిళను మోసం చేసి కోట్లు కొట్టేసిన సుప్రీంకోర్టు సీజేఐ డూప్!
X

ఇటీవల కాలంలో సామాన్యుడి నుంచి పద్మభూషణ అవార్డు గ్రహీత వరకూ ఎంతో మందిని దోచుకున్న వ్యవహారం.. "డిజిటల్ అరెస్ట్" అనే సంగతి తెలిసిందే. అసలు.. డిజిటల్ అరెస్ట్ అనేదే మన చట్టాల్లో లేదని చెబుతున్నా.. ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఏ అధికారీ ఆన్ లైన్ లో విచారణలు జరపరని మొత్తుకుంటున్నా.. జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజా డిజిటల్ అరెస్ట్ లో ఏకంగా సుప్రీంకోర్టు మాజీ సీజేఐ పేరు వాడేయడం గమనార్హం.

అవును... మీకు వచ్చిన కొరియర్ లో విదేశీ కరెన్సీ ఉందని, దొంగ పాస్ పోర్టులు ఉన్నాయని, డ్రగ్స్ ఉన్నాయని.. రకరకాల కారణాలు చెప్పి.. తాము సీబీఐ అధికారులమని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లమని చెప్పి ఆన్ లైన్ లో బెదిరిస్తూ, డిమాండ్ చేసి మరీ అందినకాడికి దోచుకుంటున్న బ్యాచ్ అరాచకాలకు రోజు రోజుకీ అడ్డూ అదుపూలేకుండా పోతోంది! ఈ క్రమంలో తాజాగా ముంబైలోని ఓ మహిళ నుంచి రూ.3.7 కోట్లు కాజేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఈ ఏడాది ఆగస్టులో ముంబైలోని అందేరీ వెస్ట్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ (68)కి ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ క్రమంలో.. పోలీసులమని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులమని చెబుతూ వరుసగా వాట్సప్ వీడియో కాల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా... ఆమె ఆధార్ కార్డుని ఉపయోగించి తెరిచిన బ్యాంక్ అకౌంట్ లో రూ.6 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లు చెప్పారు.

అక్కడికే ఆమె వణికిపోతున్న పరిస్థితుల్లో ఉంటే... ఈ వ్యవహారంపై కేసు నమోదైందంటూ ఓ డిజిటల్ కాపీని పంపించారు! ఆ కాపీలో సీబీఐ లోగో తో పాటు ఆమె నమ్మడానికి అవసరమైన ఇతరాత్ర వివరాలు ఉన్నాయి. ఈ సమయంలో... వారు అడిగినట్లుగా తన సొంత బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర ఆసుల వివరాలు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత.. ఆన్ లైన్ లో విచారణకు హాజరవ్వాలని బెదిరించారు. ఇప్పుడు అసలు కథ మొదలుపెట్టారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) పేరుతో ఓ వ్యక్తి ఆమెను విచారించారు. ఈ కేసులో బెయిల్ నిరాకరిస్తున్నట్లు చెప్పారు. పైగా.. వెరిఫికేషన్ కోసం ఆమె వద్ద ఉన్న డబ్బంతా సీబీఐకి డిపాజిట్ చేయాలని న్యాయమూర్తిగా నటించిన వ్యక్తి ఆదేశాలు జారీ చేశాడు. దీంతో.. ఆమె పలు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది అక్టోబర్ వరకూ సుమారు రూ.3.71 కోట్లు ట్రాన్ ఫర్ చేశారు.

అంతా అయిపోయిన తర్వాత.. వెరిఫికేషన్ అనంతరం ఆ సొమ్ము తిరిగి ఇస్తామని నమ్మించిన మోసగాళ్లు.. ఆ తర్వాత కాల్ కట్ చేశారు.. కాంటాక్టే కట్ చేశారు. అప్పుడు గానీ తాను మోసపోయానన్న విషయం బాధితురాలు గ్రహించలేకపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమె ట్రాన్స్ ఫర్ చేసిన డబ్బులో అధిక మొత్తం గుజరాత్ కు చెందిన వ్యక్తికి ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారని తెలుస్తోంది!