పోలీసు పంచాయితీ తర్వాత ప్రియుడి ముందే భార్య గొంతు కోసిన భర్త
జహీరాబాద్ లో ఉన్న మిస్సింగ్ కేసు నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని జడ్చర్ల పోలీసులు స్పష్టం చేయటంతో.
By: Garuda Media | 7 April 2026 12:00 PM ISTబంధాలు.. అనుబంధాలు.. కుటుంబాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి సోషల్ స్నేహాలు. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక మార్పులు భారీగా చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే.. వివాహేతర సంబంధాలు మాత్రమే కాదు.. ప్రాణాలు తీసుకునే పరిణామాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి కోసం భర్తను.. పిల్లల్ని వదిలేసి వెళ్లిన భార్య.. పోలీసు పంచాయితీ తర్వాత ఒకే కారులో భర్త.. ప్రియుడితో కలిసి వెళ్లే క్రమంలో.. లవ్వర్ ముందే భార్యను భర్త చంపేసిన ఉదంతం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
జహీరాబాద్ పట్టణ శివారుకు చెందిన 35 ఏళ్ల సిద్ధారెడ్డి.. 29 ఏళ్ల కవితలు భార్యభర్తలు. జహీరాబాద్ లో అద్దెకు ఉంటూ సిద్ధారెడ్డి పానీపూరి బండి నిర్వహిస్తుంటే.. కవిత టైలర్ గా పని చేస్తోంది. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె.. ఆరేళ్ల కొడుకు ఉన్నారు. ఇదిలా ఉంటే పదేళ్ల క్రితం ఆమెకు ఫేస్ బుక్ లో ఏపీలోని తిరుపతి జిల్లాలోని చంద్రగిరికి చెందిన 32 ఏళ్ల పవన్ కుమార్ రెడ్డితో పరిచయమైంది. అది కాస్తా పెరిగి పెద్దదై.. చివరకు వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. గత నెల 27న భర్త.. పిల్లల్ని వదిలేసిన కవిత.. జడ్చర్లలో ఉంటున్న పవన్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లిపోయింది.
భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్ధారెడ్డి.. చివరకు భార్య జడ్చర్లలో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకొని.. ఆమెను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసుల సాయంతో బయలుదేరాడు. కవిత.. ఆమె ప్రియుడికి జడ్చర్లలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి.. భర్తతో వెళ్లాలని చెప్పగా.. అందుకు కవిత ససేమిరా అన్నారు. అంతేకాదు.. అసభ్య పదజాలంతో భర్తను దూషించింది. ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సిద్ధారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లి కత్తి కొన్నాడు.
జహీరాబాద్ లో ఉన్న మిస్సింగ్ కేసు నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని జడ్చర్ల పోలీసులు స్పష్టం చేయటంతో. పోలీసు కానిస్టేబుల్ ఖదీర్ ఎస్కార్ట్ గా కారులో బయలుదేరారు. భార్యభర్తల మధ్య ఉన్న పంచాయితీ నేపథ్యంలో తాను మధ్యలో కూర్చుంటానని కవితకు కానిస్టేబుల్ ఖదీర్ చెప్పగా.. ఆమె నో చెప్పింది. కానిస్టేబుల్ కు బదులు తానే వెనుక కూర్చుంటానని భార్య.. ప్రియుడితో పాటు కలిసి కూర్చుంది. వారి కారు కాసేపట్లో జహీరాబాద్ కు చేరుకుంటామన్న వేళలో.. తన జేబులో ఉన్న కత్తిని తీసిన సిద్ధారెడ్డి.. కవిత గొంతు.. మెడపై బలంగా పొడిచేశాడు. ఈ ప్రమాదాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా.. తీవ్రగాయాల పాలైంది కవిత. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు తేల్చారు. కవిత డెడ్ బాడీని ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
