Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో దారుణం.. భారతీయుడి హత్య!

అమెరికాకు వెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌సింగ్‌ అలియాస్‌ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   1 March 2024 12:32 PM GMT
అమెరికాలో మరో దారుణం.. భారతీయుడి హత్య!
X

అమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. భారతీయులు వరుసగా ప్రమాదాల్లో మరణించడం, హత్యకు గురికావడం వరుసగా చోటు చేసుకుంటుండటం అందరిలో తీవ్ర ఆందోళన రేపుతోంది. తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌సింగ్‌ అలియాస్‌ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్‌ మరణించారు. అమెరికాలోని అలబామాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాగా రాజాసింగ్‌ ది ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ జిల్లా టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్‌ తండ్రి చనిపోయారని తెలుస్తోంది. ఆయన కుటుంబం రాజాసింగ్‌ సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. రాజాసింగ్‌ కు తల్లి, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ మృతదేహాన్ని భారత్‌ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి అతడి కుటుంబం విన్నవించింది. రాజాసింగ్‌ హత్య విషయం గురుద్వారా కమిటీ ద్వారా తమకు తెలిసిందని.. హత్య జరిగి ఐదు రోజులైనా ఇంతవరకు పోస్టుమార్టం జరగలేదని మృతుడి బావ గుర్దీప్‌ సింగ్‌ చెప్పారు. నేరస్తులను త్వరగా పట్టుకోవాలని విన్నవించారు.

రాజాసింగ్‌ కుటుంబం గురుద్వారా కమిటీ సహాయం కోరింది. కాగా ద్వేషపూరితంగానే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జాతివ్యతిరేకతతో ఈ హత్య జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

కాగా అలబామాలోని షెఫీల్డ్‌ ప్రాంతంలో ఈ సంవత్సరంలో జరిగిన రెండో ఘటన ఇది. ఫిబ్రవరిలో వసతి కోరుతూ వాగ్వాదానికి దిగిన ఒక వ్యక్తి అమెరికన్‌ హోటల్‌ లో పనిచేస్తున్న ప్రవీణ్‌ రావోజీభాయ్‌ పటేల్‌ ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఇప్పుడు మరో భారతీయుడి హత్య జరగడం కలకలం రేపుతోంది.

ఇటీవలి కాలంలో అమెరికాలో భారత్, భారత సంతతికి చెందిన వారి మరణాలు ఎక్కువైన సంగతి తెలిసిందే. గత రెండు, మూడు నెలల కాలంలో ఈ మరణాలు ఎక్కువయ్యాయి. ఈ వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. ఈ మరణాల వెనుక ప్రత్యేక కుట్ర ఏమీ లేదని తేల్చిచెప్పింది.