షాకింగ్... ఉగ్రదాడి తర్వాత సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోయారంటే..?
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు భీకర కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2025 10:30 AMఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు భీకర కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కశ్మీర్ లో భయానక వాతావరణం నెలకొంది. మరోపక్క ఈ ఘటన జరిగిన తర్వాత దేశంలో సైబర్ నేరగాళ్లు ఒక్కసారిగా విచ్చలవిడిగా రెచ్చిపోయారు.
అవును... జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడగా.. మరోపక్క ఆ ఘటన తర్వాత దేశంలో సైబర్ నేరగాళ్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఇందులో భాగంగా... ఏప్రిల్ 22 తర్వాత సుమారు 10 లక్షల సైబర్ దాడులు చోటుచేసుకున్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తాజాగా వెల్లడించింది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన మహారాష్ట్ర సైబర్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్... పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో 10 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగాయని అన్నారు. భారతీయ వెబ్ సైట్ లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్, ఇండోనేషియా, మొరాకో, పశ్చిమాసియా దేశాల నుంచి ఇవి జరిగాయని తెలిపారు.
ఇదే సమయంలో... అనేక హ్యాకింగ్ గ్రూపులు ఇస్లామిక్ గ్రూపులుగా చెప్పుకుంటున్నాయని.. అందువల్ల ఇది సైబర్ యుద్ధం కూడా కావొచ్చని యశస్వీ యాదవ్ అన్నారు! అయితే... ఈ దాడుల్లో చాలా వాటిని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్ మెంట్ తిప్పికొట్టిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో సౌబర్ మౌలిక సదుపాయలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు!
కాగా... ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాదుల పాశవిక దాడిలో ఒక కశ్మీరీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది పర్యాటకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో.. పాకిస్థాన్ కు భారత్ దౌత్యపరమైన పలు షాకులు ఇచ్చింది.
మరోపక్క.. పహల్గాం ఉగ్రదాడికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైనిక దళాలకు ఇచ్చినట్లు భారత ప్రధాని మోడీ ప్రకటించారు! దీంతో.. ఎప్పుడు ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.