Begin typing your search above and press return to search.

రూ.3 కోట్ల బీమా కోసం ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది..

మొదట రోడ్డు ప్రమాదంగా నమ్మబలికిన ఈ హైడ్రామా.. చివరకు పోలీసుల డేగ కంటికి దొరికిపోయింది. మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన ఈ దారుణ హత్యోదంతం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

By:  A.N.Kumar   |   27 May 2026 12:22 PM IST
రూ.3 కోట్ల బీమా కోసం ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది..
X

వన్ షాట్.. టూ బర్డ్స్ ఫార్ములా.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒకరు.. భారీ బీమా సొమ్ముతో లగ్జరీ లైఫ్ గడపవచ్చని మరొకరు.. కలిసి స్కెచ్ వేశారు. సాఫ్ట్‌గా ప్లాన్ చేసి, భర్తను పైలోకానికి పంపి ఆ నెపాన్ని మరొకరిపైకి నెట్టేయాలని చూశారు. మొదట రోడ్డు ప్రమాదంగా నమ్మబలికిన ఈ హైడ్రామా.. చివరకు పోలీసుల డేగ కంటికి దొరికిపోయింది. మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన ఈ దారుణ హత్యోదంతం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహేతర సంబంధం.. మనస్పర్థలు

మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన భర్త (45), ఓ భార్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి తో తన భార్య కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త కు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త తరచూ మద్యం సేవించి ఆమెను నిలదీసేవాడు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని భార్య, ఆమె ప్రియుడు గట్టిగా నిర్ణయించుకున్నారు.

'ఇన్సూరెన్స్' ప్లాన్.. అప్పుల గొడవలే అస్త్రంగా!

భర్తను కేవలం చంపేయడమే కాకుండా అతడి మరణం ద్వారా కోట్లలో సంపాదించాలని ఈ కిరాతక జంట ప్లాన్ వేసింది. ఇందుకోసం గత ఏడాది జనవరి నుంచి భర్తకు తెలియకుండా అతడి పేరు మీద వివిధ కంపెనీల్లో ఏకంగా రూ. 3 కోట్ల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు. భర్త ప్రమాద వశాత్తూ చనిపోతే ఈ డబ్బు మొత్తం భార్య కి అందుతుంది.

ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద భర్త తీసుకున్న రూ.60 వేల అప్పు వీరికి వరంగా మారింది. అప్పు తీర్చలేదనే కోపంతో అతడు పలుమార్లు భర్త ఇంటికి వచ్చి గొడవ చేశాడు, చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని గమనించిన భార్య, ఆమె ప్రియుడు జోడీ.. హత్య నిందను అప్పు ఇచ్చిన వాడిపైకి తోసేయవచ్చని భావించి, అతడితోనే హత్యకు డీల్ కుదుర్చుకున్నారు. భర్తను చంపితే రూ. 12 లక్షల సుపారీ ఇస్తామని, అడ్వాన్స్‌గా రూ. 2 లక్షలు చేతిలో పెట్టారు. మిగిలిన రూ. 10 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు వచ్చాక ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.

మద్యం తాగించి.. సుత్తితో బాది..

పథకం ప్రకారం ఈ నెల 22న రాత్రి అప్పు ఇచ్చిన వ్యక్తి అతడి సహచరుడు కలిసి ఆమె భర్తను మద్యం తాగుదామని పిలిచారు. ముల్కల్ల పంప్ హౌస్ రోడ్డు నిర్మానుష్య ప్రాంతంలో ముగ్గురు కలిసి మద్యం సేవించారు. భర్త పూర్తిగా మత్తులోకి జారుకోగానే.. ముందే తెచ్చుకున్న సుత్తితో అతడి తలపై బలంగా బాదారు.

ట్విస్ట్ ఏంటంటే హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారు. భర్త తలపై దాడి చేసిన అనంతరం.. అతడి బైక్‌తో పాటు మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదం జరిగినట్లు కలరింగ్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.

గుట్టు రట్టు చేసిన పోలీసులు

అర్ధరాత్రి సమయంలో అటుగా వెళ్లిన ప్రయాణికులు రోడ్డుపై పడి ఉన్న భర్తను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు.

మొదట హిట్‌ అండ్ రన్ కేసుగా భావించినప్పటికీ.. మృతుడి తల్లి తన కుమారుడి మరణంపై కోడలి ప్రవర్తనపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, అనుమానితుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు. భార్య, ఆమె ప్రియుడు, హత్య చేసిన అప్పులు ఇచ్చిన వ్యక్తి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు.. ఇన్సూరెన్స్ పాలసీల వ్యవహారం బయటపడటంతో పోలీసులు షాకయ్యారు.

నిందితుల అరెస్ట్

పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు తప్పు ఒప్పుకున్నారు. భార్య, ఆమె ప్రియుడు తో పాటు సుపారీ హంతకుడు ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తి, కొంత నగదు, టూ వీలర్, రూ. 3 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ, అక్రమ సంబంధం ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.