Begin typing your search above and press return to search.

ఆరుపదుల వయసులో డాక్టర్ భార్యను చంపేసిన డాక్టర్

ఈ దారుణానికి పాల్పడింది స్వయాన ఆమె భర్తే అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత.. స్థానికులకు మరింత షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 5:22 AM GMT
ఆరుపదుల వయసులో డాక్టర్ భార్యను చంపేసిన డాక్టర్
X

భార్యభర్తలు ఇద్దరు డాక్టర్లు. పట్టణంలో మంచి పేరుంది. ఆరుపదుల వయసులో నలుగురికి సాయం చేస్తూ.. మంచి పనులు చేస్తూ క్రిష్ణారామా అంటూ కాలక్షేపం చేయాల్సిన వయసులో.. డాక్టర్ అయిన తన భార్యను హత్య చేయాలన్న మాయరోగం పట్టిన భర్త (ఆయన కూడా డాక్టరే) దారుణంగా హతమార్చిన వైనం షాకింగ్ గా మారింది. ఇదేం పోయే కాలం అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

ప్రాణం పోయాల్సిన డాక్టర్.. ఆరు పదుల వయసులో భార్యను అత్యంత క్రూరంగా చంపేయటం.. పోలీసుల్ని తప్పుదారి పట్టేలా చేశారు. తప్పు చేసినోడు తప్పించుకోలేరన్న నిజాన్ని మిస్ కావటమే కాదు.. లాజిక్ తప్పి అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యారు. అసలేం జరిగిందంటే..క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర సంచలనంగా మారిన డాక్టర్ రాధ హత్య అందరిని కలిచివేసింది. అయితే.. ఈ దారుణానికి పాల్పడింది స్వయాన ఆమె భర్తే అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత.. స్థానికులకు మరింత షాకింగ్ గా మారింది.

మచిలీపట్నానికి చెందిన రాధా.. మహేశ్వరరావులు వైద్య దంపతులు. జవ్వారుపేటలో వారికి సొంత హస్పిటల్ ఉంది. గత నెల 25 రాత్రి తన భార్యను ఎవరో హత్య చేసి.. నగలు దొంగలించినట్లుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. ఏ కోణంలో నుంచి చూసినా.. వైద్యురాలిని హత్య చేసే కారణం లభించలేదు. నగల కోసం హత్య చేశారనుకున్నా.. దానికి సంబంధించిన లాజిక్కులు చిక్కని పరిస్థితి.

అదే సమయంలో.. పాతికేళ్లు కలిసి కాపురం చేసిన వేళ.. భార్య హత్యకు గురైతే షాక్ లో ఉండాల్సిన భర్త అందుకు భిన్నంగా తర్వాతి రోజు రోటీన్ గా ఓపీకి హాజరు కావటం పోలీసుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. భర్త మీద అను మానం వచ్చిన పోలీసులు జాగ్రత్తగా వివరాలు సేకరించటం షురూ చేశారు. భార్యభర్తల మధ్య కోట్లాది రూపాయిల ఆస్తులకు సంబంధించిన వివాదం నడుస్తున్నట్లుగా గుర్తించారు.

దీంతో.. ప్రాధమిక ఆధారాలతో సదరు డాక్టర్ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. వివరాలన్ని బయటకు వచ్చేశాయి. తన భార్యను తాను.. తన డ్రైవర్ సాయంతో చంపేసిన విషయాన్ని డాక్టర్ ఒప్పుకున్నారు. తన వద్ద పదిహేనేళ్లుగా డ్రైవర్ గా.. అటెండర్ గా పని చేస్తున్న మధుకు పెద్ద ఎత్తున డబ్బులు.. బంగారాన్ని ఆశ చూపించి హత్యకు ప్లాన్ చేశానని చెప్పారు. జులై 25 సాయంత్రం ఆసుపత్రి రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న తన భార్య రాధ వద్దకు వెళ్లారు. డ్రైవర్ మధుతో కలిసి వెళ్లిన భర్త.. తన భార్యను కదలకుండా ఉండేలా మధును పట్టుకోవాలని చెప్పి.. రెంచితో తల వెనుక భాగంలో బలంగా మోదారు. దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది.

దారుణంగా హత్య చేసిన అనంతరం ఏమీ తెలీనట్లుగా తన క్లినిక్ కు వెళ్లి కూర్చున్న భర్త.. రాత్రి 10.30 గంటల వేళలో పోలీసులకు ఫోన్ చేసి.. తన భార్య హత్యకు గురైనట్లుగా సమాచారం అందించారు. భార్య మరణించిందన్న బాధ.. వేదన లేకపోవటం.. హత్య జరిగిన తర్వాతి రోజు యధావిధగా ఆసుపత్రికి వెళ్లి రోగులకు ఓపీ చూడటంతో సందేహం రావటం.. ఆ తర్వాత వివరాల్ని సేకరించటంతో డాక్టరమ్మ హత్య మిస్టరీ వీడింది. దీంతో.. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.