హత్య చేసి.. అక్కడే స్నానం చేసి : గేటెడ్ కమ్యూనిటిల్లో భద్రతపై అనుమానాలు?
ఈ ఘటనలో కీలకంగా మారింది ఇంట్లో కొత్తగా చేరిన ఇద్దరు పనిమనుషుల పాత్ర. హర్ష, రోషన్ అనే ఈ యువకులు కేవలం వారం క్రితమే పనిలో చేరారు.
By: Tupaki Desk | 11 Sept 2025 10:41 AM ISTహైదరాబాద్‌లోని కూకట్‌పల్లి స్వాన్‌లేక్ గేటెడ్ కమ్యూనిటీలో గృహిణి రేణు అగర్వాల్ దారుణ హత్య నగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది. బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకు హత్య జరగడం, ఈ ఘటన గేటెడ్ కమ్యూనిటీ లోపలే జరగడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ భయానక సంఘటన గేటెడ్ కమ్యూనిటిల్లో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దారుణం ఎలా జరిగింది?
దుండగులు మొదట బాధితురాలి చేతులు, కాళ్లు కట్టేసి, తరువాత వంటింట్లో ఉన్న రైస్ కుకర్‌తో తలపై బలంగా దాడి చేశారు. గాయాల తీవ్రత కారణంగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆభరణాలు మాయం కావడంతో దోపిడీ కోణంలో పోలీసులు విచారణ జరుపుతుున్నారు.
పని మనుషుల తీరు అనుమానస్పదం
ఈ ఘటనలో కీలకంగా మారింది ఇంట్లో కొత్తగా చేరిన ఇద్దరు పనిమనుషుల పాత్ర. హర్ష, రోషన్ అనే ఈ యువకులు కేవలం వారం క్రితమే పనిలో చేరారు. సీసీ కెమెరాల్లో వీరు లగేజీతో బయటకు వెళ్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు వీరినే ప్రధాన నిందితులుగా గుర్తించారు.
దర్యాప్తు పురోగతి
పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రదేశాల్లో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. అయితే ఈ కేసు గేటెడ్ కమ్యూనిటీలలోని భద్రతా లోపాలను బహిర్గతం చేసింది.
దుండగుల్లో కనిపించని భయం
పాశవికంగా హత్యకు పాల్పడిన దుండగుల్లో ఏ మాత్రం భయం కనిపించలేదు. హత్య అనంతరం అదే ఇంట్లో స్నానాలు చేసుకొని, రక్తపు మరకలు ఉన్న బట్టలు అక్కడే వదిలేసి పోవడాన్ని గమనిస్తే ప్రొఫెషనల్ కిల్లర్స్ అని అర్థమవుతున్నది. అనంతరం ఆ ఇంటి యాజమాని స్కూటీపైనే పారిపోవడం గమనార్హం.
గేటెడ్ లో ఆందోళన
ప్రస్తుతం నగరంలో వందల గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఉన్నా, ఇంటి పనిమనుషులు, భద్రతా కార్మికులు, డ్రైవర్లు, ఇతర పనులు చేసే కార్మికులను చేర్చుకునేటప్పుడు నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నిర్లక్ష్యమే ఇలాంటి ఘోర సంఘటనలకు కారణమవుతోందని పోలీస్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
నిర్లక్ష్యం చూపితే అంతే..
గేటెడ్ కమ్యూనిటీ అంటేనే సంపూర్ణ భద్రత అనే అపోహను ఈ ఘటన చెరిపేసింది. ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం కూలీలు, కార్మికుల గురించి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని ఈ ఘటన రుజువు చేస్తున్నది. కొత్తగా పనుల్లో చేర్చకునే సమయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయడం అత్యవసరమని రేణుకా అగర్వాల్ హత్య హెచ్చరిస్తున్నది. లేనిపక్షంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం తప్పదు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
గృహ సహాయకులు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది వంటి వారిని నియమించే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలి.
గేటెడ్ కమ్యూనిటీలలో బయోమెట్రిక్ ఎంట్రీ సిస్టమ్ అమలు చేయాలి.
ప్రతి బ్లాక్/టవర్‌లో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షణ ఉండాలి.
నివాసులు కూడా కొత్త సిబ్బందిపై అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలి.
అపార్ట్మెంట్ అసోసియేషన్లు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలి
