Begin typing your search above and press return to search.

అక్కను చంపేసింది చెల్లెలే.. కోరుట్ల మిస్టరీ రివీల్

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కోరుట్ల మిస్టరీ వీడింది.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:16 AM GMT
అక్కను చంపేసింది చెల్లెలే.. కోరుట్ల మిస్టరీ రివీల్
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కోరుట్ల మిస్టరీ వీడింది. తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లిన వేళ.. పెద్ద కుమార్తె అనుమానాస్పద రీతిలో మరణించగా.. చిన్న కుమార్తె ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఉదంతం షాకింగ్ గా మారటం తెలిసిందే. దీనికి తోడు.. కిచెన్ లో మద్యం సీసాలు లభ్యం కావటంతో మరిన్ని అనుమానాలకు తావివ్వటం తెలిసిందే. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న మిస్టరీ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు రోజుల వ్యవధిలోనే చేధించటమే కాదు.. అక్క అనుమానాస్పద మరణంలో చెల్లెలే కీలక పాత్ర పోషించిందని.. అక్కను హత్య చేసిందన్న విషయాన్ని పోలీసులు తాజాగా వెల్లడించారు.

అక్క మరణం నేపథ్యంలో వస్తున్న విమర్శలపై వాయిస్ మెజేస్ తో తన తమ్ముడు సాయికి పంపిన చందన.. ‘‘నమ్మరా సాయి, అక్కను నేనెందుకు చంపుతా’’ అంటూ అమాయక గొంతుతో పంపిన వాయిస్ మెసేజ్ లో నిజం లేదని.. ఆమెనే అక్కను పొట్టన పెట్టుకుందన్న సంచలన విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీంతో.. ఈ ఉదంతంపై నెలకొన్న సస్పెన్స్ వీడిపోయింది.

ఇంతకూ అక్కను చెల్లెలు ఎందుకు చంపిందన్న విషయంలోకి వెళితే.. తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయే వేళ.. తనను అడ్డుకున్న అక్కను ప్రియుడితో కలిసి చంపేసిన దుర్మార్గానికి పాల్పడింది చెల్లెలు చందన. ఈ సంచలన కేసుకు సంబంధించిన వివరాల్ని జగిత్యాల ఎస్పీ భాస్కర్ వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల్లో ముఖ్యాంశాల్ని చూస్తే..

- కోరుట్లకుచెందిన బంక శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. పెద్ద కుమార్తె దీప్తి (22) ఐటీ ఉద్యోగిని. ఇంటి నుంచే పని చేస్తోంది. రెండో కుమార్తె చందన బీటెక్ చేసి ఇంటి వద్దే ఉంటోంది. కొడుకు బెంగళూరులో చదువుకుంటున్నాడు.

- ఆగస్టు 28న శ్రీనివాసరెడ్డి దంపతులు హైదరాబాద్ లోని ఫంక్షన్ కు వెళ్లగా.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. 29న సోఫాలో దీప్తి అనుమానాస్పద రీతిలో మరణించినట్లుగా గుర్తించారు. చందన కనిపించకుండా పోయింది. మేడ్చల్ సమీపంలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిన చందనకు తన క్లాస్ మెట్ ఉమర్ షేక్ సుల్తాన్ తో ప్రేమ వ్యవహారం ఉంది. అతగాడు సీనియర్ అయినప్పటికీ డిటైన్ కావటంతో ఆమెతో కలిసి చదివాడు. క్లాస్ మేట్ అయ్యాడు.

- ఉమర్ సొంతూరు నెల్లూరు. ప్రస్తుతం అతని కుటుంబం హైదరాబాద్ లోని అడ్డగుట్ట. ప్రస్తుతం ప్రగతినగర్ లో ఉంటున్నారు. గత నెల 19న ఉమర్ కోరుట్ల వచ్చాడు. అప్పుడే చందన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామంటే వినలేదు. తన ఇంట్లో బంగారం.. క్యాష్ ఉన్నాయని చెప్పి.. పెళ్లి చేసుకుందామని ఒప్పించింది.

- ఈ సమయంలో ఉమర్ తన తల్లిదండ్రులతో చందన చేత వాట్సాప్ కాల్ మాట్లాడించాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇంట్లో సొమ్ముల్ని తీసుకెళ్లేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న చందనకు.. తల్లిదండ్రులు ఫంక్షన్ కోసం హైదరాబాద్ వెళ్లటంతో.. ప్రియుడ్ని ఊరికి రమ్మని ఫోన్ చేసింది. చందన తల్లిదండ్రులు ఊరికెళ్లిన రోజే.. ఉదయం 11 గంటల వేళలో కారులో కోరుట్లకు చేరుకున్నాడు. ఇంటి వెనుక కారులో వెయిట్ చేశాడు.

- ఆ రోజు రాత్రి అక్క దీప్తి చేత చందన వోడ్కా తాగించింది. తాను బ్రీజర్ తాగింది. తెల్లవారుజామున రెండు గంటల వేళలో బీరువాలో బంగారం.. డబ్బును బ్యాగులో వేసుకుంటూ ఉండగా.. దీప్తికి మెలుకువ వచ్చింది. చెల్లిని వారిస్తూ పెద్దగా అరవటంతో చందన ప్రియుడ్ని ఇంట్లోకి పిలిచింది. తన స్కార్ఫ్ తో అక్క నోటికి కట్టేసింది. అరవొద్దంటూ గట్టిగా ఆదిమి పెట్టింది. మరోవైపు ప్రియుడు ఉమర్ ఆమె చేతుల్ని కట్టేశాడు. అయితే.. దీప్తి అరుపులు ఆపకపోవటంతో ప్రియుడి సాయంతోఅక్క ముడికి ముక్కుకు ప్లాస్టర్ వేసింది. దీంతో దీప్తి సోఫాలో పడిపోయింది.

- కాసేపటికి అక్క చనిపోయిందని గుర్తించిన తర్వాత. మందు తాగి చనిపోయిందని నమ్మించేలా ఆమె నోటికి, ముక్కుకు వేసిన ప్లాస్టర్ ను తీసేసి.. కట్లు విప్పేసి డబ్బు.. నగలతో పారిపోయారు. కోరుట్ల నుంచి హైదరాబాద్ కు వెళ్లిన చందన.. ఆ తర్వాత తన తమ్ముడు సాయికి సెల్ ఫోన్ లో ఆడియో క్లిప్ పంపింది. అక్కను తాను చంపలేదని.. మద్యం తాగిన తర్వాత ఏమైందో తనకు తెలీదని పేర్కొంది.

- చందన తీసుకొచ్చిన డబ్బు.. బంగారంతోవారిని ముంబయి కానీ నాగపూర్ కానీ వెళ్లిపోవాలని ఉమర్ తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీప్తిని చంపేసిన విషయం ఉమర్ తల్లిదండ్రులకు తెలిసినా.. వారుచెప్పక పోవటంతో వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.కారులో వీరిని పలుచోట్ల కు తీసుకెళ్లిన హఫీజ్ అనే ఫ్రెండ్ మీదా కేసు నమోదు చేవారు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. నిజామాబాద్ లో నిందితుల్ని పట్టుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వీరినుంచి రూ.1.20 లక్షల క్యాష్.. 70 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ చదివి.. ప్రేమించిన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవటం కోసం అక్కను అన్యాయంగా చంపేసిన చందన ఉదంతం ఇప్పుడు జీర్ణించుకోలేనిదిగా మారింది.