లా స్టూడెంట్ పై గ్యాంగ్ రే*ప్... కోల్ కతాలో అసలేం జరిగింది?
ఇందులో భాగంగా... ఈనెల 25 రాత్రి 7:30 నుంచి 10:50 గంటల మధ్య ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
By: Tupaki Desk | 27 Jun 2025 6:03 PM ISTపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల ఓ జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మరోసారి అదేరాష్ట్రంలో కోల్ కతా లో అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా ఓ న్యాయ విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్ లోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు.
అవును... కస్బాలోని సౌత్ కోల్ కతా లా కాలేజ్ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఈనెల 25 రాత్రి 7:30 నుంచి 10:50 గంటల మధ్య ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఈ ఘటనపై మరుసటిరోజు కేసు నమోదయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు కళాశాల సిబ్బంది కాగా.. మరొకరు పూర్వ విద్యార్థి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి ప్రాథమిక చికిత్స అందించి, వాంగ్మూలం తీసుకున్నామని.. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలిస్తున్నారని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటన అప్పుడే రాజకీయ రంగు పులుముకుంది! ఈ ఘటనపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఇందులో భాగంగా... బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందిస్తూ.. ఈ ఘటనను ఖండిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నిందితుల్లో ఒకరు టీఎంసీ పార్టీకి చెందిన సభ్యుడు అని తెలుస్తోందని అన్నారు.
లా విద్యార్థినిపై కాలేజీలో సామూహిక అత్యాచారం జరిగిందని.. నిందితుల్లో ఒక పూర్వ విద్యార్థితో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారని.. షాకింగ్ విషయం ఏమిటంటే.. నిందితుల్లో టీఎంసీ పార్టీకి చెందిన సభ్యుడు కూడా ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన భయానక ఘటనను మరవకముందే మరో ఘటన చోటుచేసుకుందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా... ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో అక్కడి మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. ఇదే సమయంలో.. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు బీజేపీ అండగా ఉంటుందని.. ప్రతీ నిందితుడికీ శిక్షపడేవరకూ తమ పోరాటం ఆగదని ‘ఎక్స్’ లో రాసుకొచ్చారు.
ఫిర్యాదులో బాధితురాలు సంచలన వ్యాఖ్యలు!:
ఈ సందర్భంగా తన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించింది బాధితురాలు. ఇందులో భాగంగా... ఈ ఘటనలోని ప్రధాన నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించాడని.. అయితే, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తిరస్కరించానని.. అప్పటినుంచి తనపై చాలా కోపంగా ఉంటున్నాడని ఆమె ఆరోపించింది.
ఇదే సమయంలో... పోలీసులకు తన బాధను వివరిస్తూ.. నిందితుడు తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడని.. తనను, తన ప్రియుడిని చంపుతానని బెదిరించాడని.. తన తల్లిదండ్రులను అరెస్టు చేయిస్తానని చెప్పాడని తెలిపింది. ఆ సమయంలో తాను అతడి కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా వదలలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
