Begin typing your search above and press return to search.

మేనత్తను దోచేసి.. పోలీసులకు అడ్డంగా బుక్

కర్నాటకలోని అంజుటగి గ్రామానికి చెందిన 70 ఏళ్ల నింబవ్వ అనే పెద్ద వయస్కురాలికి నింగప్ప అనే మేనల్లుడు ఉన్నాడు.

By:  Tupaki Desk   |   3 May 2025 4:48 PM IST
మేనత్తను దోచేసి.. పోలీసులకు అడ్డంగా బుక్
X

ఊహకు అందని రీతిలో జరుగుతున్న నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కర్ణాటక రాష్ట్రం. గతంలో నేరాలతో ముడి పడిన ఉదంతాలు తక్కువగా ఉండేవి. ఇటీవల కాలంలో సంచలన నేరాలు కర్ణాటక రాష్ట్రంలో తరచూ జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. పెద్ద వయస్కురాలైన మేనత్తకు సాయం చేస్తున్నట్లు నటించి..ఆమెను దోచేసిన షాకింగ్ వైనం వెలుగు చూసింది. అతగాడి పాడు పనిని పోలీసులు గుర్తించటంతో అందరూ అవాక్కు అయిన పరిస్థితి.

కర్నాటకలోని అంజుటగి గ్రామానికి చెందిన 70 ఏళ్ల నింబవ్వ అనే పెద్ద వయస్కురాలికి నింగప్ప అనే మేనల్లుడు ఉన్నాడు. బంధువుల ఇంటికి బైక్ మీద తీసుకెళ్లిన ఇతగాడు.. తిరిగి వచ్చే వేళలో బండిలో పెట్రోల్ అయిపోయిందని.. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తీసుకొస్తానని చెప్పి రోడ్డు పక్కన బైక్ ఆపేశాడు. మేనత్తను అక్కడే ఉండమన్నాడు.

పెట్రోల్ సీసా తీసుకొని వెళ్లిన అతడు.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత తనతో తెచ్చుకున్న దుస్తుల్ని మార్చేసుకొని.. ముఖానికి రుమాలు కట్టుకొని.. మళ్లీ వెనక్కి వచ్చాడు. మేనత్తను కత్తితో బెదిరించి.. కంట్లో కారం జల్లి ఆమె నగల్ని దోచుకున్నాడు. కాసేపటికి ఏమీ ఎరగనట్లుగా తిరిగి వచ్చాడు. దొంగతనం గురించి తెలుసుకున్నట్లుగా నటించి..ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.

ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి అతడ్ని ప్రశ్నించగా.. సంబంధం లేని సమాధానాలు ఇవ్వటంతో అతగాడిని తమదైన శైలిలో విచారించారు. దెబ్బకు తాను చేసిన పాడు పనిని అంగీకరించాడు. దీంతో.. నింబవ్వతో సహా అందరూ షాక్ కు గురైన పరిస్థితి. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.