Begin typing your search above and press return to search.

దేశంలో గంటకు 3 హత్యలు.. కారణాలివే!

ఏడాది ముగుస్తున్న వేళ.. వివిధ శాఖలకు సంబంధించిన గణాంకాలు విడుదల చేయటం తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Dec 2023 11:30 PM GMT
దేశంలో గంటకు 3 హత్యలు.. కారణాలివే!
X

ఏడాది ముగుస్తున్న వేళ.. వివిధ శాఖలకు సంబంధించిన గణాంకాలు విడుదల చేయటం తెలిసిందే. తాజాగా జాతీయ నేర గణాంకాలు 2022 వెల్లడైంది. ఇందులో వెల్లడైన అంశాల్ని చూస్తే.. దేశంలో 2022లో 28,522 మంది హత్యకు గురైనట్లుగా తేల్చారు. అంటే.. రోజుకు దేశ వ్యాప్తంగా 78 మంది హత్యకు గురి అవుతున్నారు. గంటల్లోకి తీసుకుంటే.. ఒక గంట గడిస్తే దగ్గర దగ్గర 3కంటే ఎక్కువగా హత్యకు గురవుతున్నారు. 2021తో పోలిస్తే హత్యలు కాస్తంత తగ్గినప్పటికీ.. గుర్తించేంత స్థాయిలో మాత్రం తగ్గని పరిస్థితి. 2021తో పోలిస్తే 2002లో హత్యలు 2.6శాతం తగ్గాయి.

ఈ హత్యలకు కారణం ఏమిటి? తోటి మనిషిని చంపే వరకు ఎందుకు వెళుతున్నారు? అన్న విషయంలోకి వెళితే.. వ్యక్తిగత ప్రతీకారం.. శత్రుత్వం.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధాన కారణాలుగా గుర్తించారు. సాధారణ నేరాలు 2022లో తగ్గాయి. అయితే.. మహిళలు.. చిన్నారులు.. పెద్ద వయస్కులు.. ఎస్సీ.. ఎస్టీలపై మాత్రం నేరాలు పెరిగాయి. తాజాగా విడుదలైన జాతీయ నేర గణాంకాల్ని చూస్తే.. మహిళలపై 4 శాతం.. చిన్నారులపై 8.7 శాతం నేరాలు పెరిగాయి.

కిడ్నాపుల సంఖ్య కూడా పెరిగింది. ఆర్థిక నేరాలు 11.1 శాతం పెరగ్గా.. అవినీతి కేసులు సైతం 10.5 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. అన్నింటికి మించి 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాల సంఖ్య ఏకంగా 24.4 శాతం పెరిగినట్లుగా తేల్చారు. నేరాలుగా నమోదైన వాటి సంఖ్యే ఇంత ఉండే.. పోలీసుల వరకు రాని మోసాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దేశంలో అత్యధిక సైబర్ నేరాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. నకిలీ వార్తల్ని వ్యాప్తి చేయటంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉండటం గమనార్హం.

సైబర్ నేరాల్లో మోసం చేయటంలో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో బ్యాంకింగ్ మోసాలు.. మూడో స్థానంలో ఓటీపీ మోసాలు.. ఏటీఎం మోసాలు ఉన్నాయి. మనుషుల అక్రమ రవాణా కూడా పెరిగినట్లుగా వెల్లడించారు. ఆస్తి సంబంధిత నేరాలు 10.1 శాతం పెరిగినట్లుగా తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే.. కేసుల నమోదు సంఖ్య తగ్గినట్లుగా పేర్కొన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు క్రైం రేట్ 445.9 నుంచి 422.2 కు దిగివచ్చినట్లుగా చెబుతున్నారు.