రీల్ కాదు రియల్: భార్య అనుకొని మరో మహిళను పొడిచేశాడు
మద్యం మత్తులో ఉన్న అతను.. భార్య మీద ఆగ్రహంతో వంటింట్లో ఉన్నకూరగాయలు కోసే కత్తిపీట పట్టుకొని.. భార్య మీద దాడికి ప్రయత్నించాడు.
By: Tupaki Desk | 8 Jun 2025 12:00 PM ISTభార్య అనుకొని మరో మహిళతో ఏదో చేసేయటం.. ఈ తరహా రీల్స్ ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. కామెడీగా కనిపించే ఈ చిట్టి వీడియోలకు పూర్తి భిన్నంగా హైదరాబాద్ లోని మైలారుదేవురుపల్లిలో షాకింగ్ క్రైం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య అనుకొని మరో మహిళను కత్తితో పొడిచిన వైనం షాకింగ్ గా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు మహిళ పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన నేహ ఫ్యామిలీ కాటేదాన్ లో ఉంటోంది. వీరి ఇంటి పక్కనే బిహార్ కు చెందిన అజ్గర్ అలీ ఫ్యామిలీ కూడా నివసిస్తోంది. బక్రీద్ నేపథ్యంలో నేహ పేరెంట్స్ సలీం.. రేష్మలు కుమార్తె ఇంటికి వచ్చారు.మద్యానికి బానిస అయిన సలీం శుక్రవారం రాత్రి వేళ మద్యం తాగి గొడవ చేశాడు. కూతురు ఇంటికి వచ్చిన తర్వాత కూడా తీరు మ మార్చుకోవా? అంటూ భార్య సలీంను మందలించింది.
మద్యం మత్తులో ఉన్న అతను.. భార్య మీద ఆగ్రహంతో వంటింట్లో ఉన్నకూరగాయలు కోసే కత్తిపీట పట్టుకొని.. భార్య మీద దాడికి ప్రయత్నించాడు. అతడి ఆవేశాన్ని గమనించిన సలీం భార్య.. కుమార్తెలు బయటకు పరిగెత్తారు.పక్కింట్లో జరుగుతున్న హడావుడి.. అరుపులు.. కేకలతో జుబేదా బేగం బయటకు వచ్చింది. దురదృష్టవశాత్తు సలీం భార్య రేష్మ ధరించిన రంగు చుడీదార్ నే జుబేదా బేగం ధరించింది.
దీంతో.. భార్య అనుకున్న సలీం కత్తిపీటతో పక్కింటామెను పొడిచి పరారయ్యాడు. దీంతో.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు.