Begin typing your search above and press return to search.

20 ఏళ్ల జైలు.. వీడి పాపానికి అంతకుమించిన శిక్ష పడాల్సింది

మనిషి అన్నోడు చేయని.. చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. కానీ.. కామపిశాచాలకు అవేమీ పట్టవు. అలాంటోళ్లను నాగరిక సమాజం అస్సలు అంగీకరించకూడదు.

By:  Tupaki Desk   |   2 May 2026 10:56 AM IST
20 ఏళ్ల జైలు.. వీడి పాపానికి అంతకుమించిన శిక్ష పడాల్సింది
X

మనిషి అన్నోడు చేయని.. చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. కానీ.. కామపిశాచాలకు అవేమీ పట్టవు. అలాంటోళ్లను నాగరిక సమాజం అస్సలు అంగీకరించకూడదు. విన్నంతనే రక్తం మరిగేలాంటి తప్పులకు జైలుశిక్షలాంటివి చాలా చిన్న శిక్షలుగా చెప్పాలి. ఏడాది క్రితం చోటు చేసుకున్న ఒక దుర్మార్గానికి సంబంధించి.. నిందితుడికి ఇరవైఏళ్ల జైలు విధించింది న్యాయస్థానం. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ కసాయికి మరణశిక్షే సరైనదన్న మాట వినిపిస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతుర్ని.. తానే కాటేసిన దురాగతానికి సంబంధించి ఒక తండ్రికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలు విధించింది.

మద్యం మత్తులో పదిహేనేళ్ల కన్నకూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఉదంతమిది. మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. బిహార్ కు చెందిన 37 ఏళ్ల అస్గర్ అలీ తన భార్య.. కుమారుడు.. ఇద్దరు కుమార్తెలతో కలిసి 2019లో హైదరాబాద్ మహానగరానికి వచ్చేశాడు. జీడిమెట్ల పరిధిలో కూలిపనులు చేసుకుంటూ ఉండేవాడు. మద్యానికి బానిసగా మారిన ఇతను తరచూ భార్యాబిడ్డల్ని వేధించేవాడు. ఏడాది క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాగిన మైకంలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈదారుణానికి పాల్పడిన ఈ కసాయి.. ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించాడు. పని కోసం బయటకు వెళ్లి వచ్చిన తల్లికి.. ఇంటికి రాగానే కూతురు ఏడుస్తూ విషయాన్ని చెప్పేసింది. దీంతో షాక్ తిన్న ఆమె.. వెంటనే భర్త చేసిన పాపం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టారు. నేరం రుజువు కావటంతో నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష విధించినట్లుగా కోర్టు తన తీర్పును ఇచ్చింది. బాధితురాలికి పునరావాసం.. వైద్యం.. మానసిక సాయం కోసం రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ వర్గాల్ని ఆదేశించింది.ఇలాంటి పాపాత్ముడికి సుదీర్ఘకాలం జైలు కంటే.. అనంతలోకాలకు పంపేయటమే మంచిన్నఆగ్రహాం పలువురు నోట వినిపిస్తోంది.