Begin typing your search above and press return to search.

వీడెంత సైకో అంటే? రెండో భార్యతో ఏకాంతంగా ఉన్న ఫోటోల్ని పంపి టార్చర్

చాలా సందర్భాల్లో వీడు మనిషి కాదు మృగం అనేస్తాం. కానీ.. ఈ ఉదంతంలోని సైకోను అలా అంటే.. జంతువులను కూడా అవమానించినట్లే.

By:  Garuda Media   |   2 April 2026 8:00 PM IST
వీడెంత సైకో అంటే? రెండో భార్యతో ఏకాంతంగా ఉన్న ఫోటోల్ని పంపి టార్చర్
X

చాలా సందర్భాల్లో వీడు మనిషి కాదు మృగం అనేస్తాం. కానీ.. ఈ ఉదంతంలోని సైకోను అలా అంటే.. జంతువులను కూడా అవమానించినట్లే. ఎందుకంటే.. ఇలాంటి సైకో చేసే పనులు ఏ పశువు కూడా చేయదు. చివరకు మృగం సైతం ఈ తరహా వ్యవహారశైలి ఉండదు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధిలోని ఒక వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. పోలీసులు సైతం సైకో భర్త తీరుకు విస్మయానికి గురవుతున్నారు. మనిషి అనేటోడు ఇలా కూడా చేస్తాడా? అన్నట్లుగా అతడి తీరు ఉండటమే దీనికి కారణం.

షాకింగ్ నిజం ఏమంటే.. పదిహేనేళ్ల క్రితం ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టి.. పెద్దవాళ్లు అవుతున్న వేళలో.. మరో యువతితో ప్రేమలో పడ్డానని చెప్పటమే కాదు.. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసేవాడు. దీనికి భార్య ఒప్పుకోలేదు. నిన్ను చేసుకున్నట్లే.. ఆమెను చేసుకుంటానని చెప్పేవాడు. తన రెండో భార్య కూడా తమతోనే ఉండాలని.. ఒకవేళ తాను చెప్పినట్లు వినకుంటే బతకనీయనంటూ వేధింపులకు గురి చేసేవాడు.

రెండో పెళ్లికి భార్య వ్యతిరేకిస్తున్నా ఆమెను పెళ్లి చేసుకున్నాడు .. ఆమెతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు.. వీడియోలను మొదటి భార్య కి పంపి టార్చర్ పెట్టేవాడు. ఇది సరిపోదన్నట్లు తనకు నచ్చినప్పుడు ఇంటికి రావటం..నానా మాటలు అనటం.. ఆ పై కొట్టటం చేసేవాడన్న విషయాల్ని పోలీసులు విచారణలో గుర్తించారు. వీరి గొడవకు స్థానికులు సైతం కలుగజేసుకొని ఇద్దరిని సముదాయించేవారు. భర్త వేధింపులు అంతకంతకూ పెరిగిపోవటంతో భర్తతో తనకు విడాకులు కావాలని కోరుతూ గ్రామంలోని పెద్దల వద్దకు వెళ్లి పంచాయితీ పెట్టింది.

అప్పుడు మాత్రం భార్యతో బుద్ధిగా ఉంటానని.. ఇకపై ఏ తప్పు చేయని పెద్దలను నమ్మిస్తూ వచ్చిన భర్త.. తీరా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించేవాడు. గత నెల 29న కూడా ఊళ్లోని పెద్దల వద్దకు పంచాయితీకి వెళ్లిన ఆమెకు.. భర్తతోనే ఉండాలని.. సర్దుకుపోవాలని చెప్పటంతో వేరే దారి లేక నిరాశతో తిరిగి వచ్చేసింది. సోమవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చిన భార్యని ని పిల్లల ముందే దారుణంగా కొట్టిన భర్త.. నిన్నూ పిల్లల్ని చంపేస్తానని బెదిరించినట్లుగా తెలుస్తోంది.

అదే విషయాన్ని రాత్రి ఆమె , అలానే ఆమె పెద్దకొడుకు వేర్వేరుగా బంధువులకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఏమైందో కానీ.. పక్క రోజున పిల్లలు ఇద్దరిని చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు చావులకు కారణమైన నిందితుడును.. అతడి రెండో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా..ఊళ్లోని భర్త ఇంటి ముందు పిల్లల ఇద్దరి అంత్యక్రియల్ని చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. ఊళ్లో ఇంటిపై మొదటి భార్య బంధువులు దాడికి దిగారు.పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పటంతో శాంతించారు.