Begin typing your search above and press return to search.

దృశ్యం.. దృశ్యం 2 చూసి ప్లాన్ చేసింది.. అడ్డంగా దొరికింది!

భారీగా విజయవంతమైన దృశ్యం..దృశ్యం 2 సినిమాల స్ఫూర్తితోనే తాను ప్లానింగ్ చేసినట్లుగా చెప్పటంతో పోటీసులు సైతం అవాక్కుఅయిన పరిస్థితి. గుజరాత్ లోని పాటన్ జిల్లా జఖోట్రా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   29 May 2025 9:46 AM IST
దృశ్యం.. దృశ్యం 2 చూసి ప్లాన్ చేసింది.. అడ్డంగా దొరికింది!
X

రీల్ వేరు..రియల్ వేరన్న చిన్న విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. కొన్ని సినిమాల్ని స్ఫూర్తిగా చేసుకొని చోరీలు.. మర్డర్లు ప్లాన్ చేసి బుక్ అవుతుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి గుజరాత్ లో చోటు చేసుకుంది. భర్తను వదిలేసి.. ప్రియుడితో జంప్ అయ్యందుకు వేసిన మర్డర్ ప్లాన్ రివర్సు అయ్యి.. చివరకు బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోలీసులకు దొరికిపోయిన వైనం సంచలనంగా మారింది. భారీగా విజయవంతమైన దృశ్యం..దృశ్యం 2 సినిమాల స్ఫూర్తితోనే తాను ప్లానింగ్ చేసినట్లుగా చెప్పటంతో పోటీసులు సైతం అవాక్కుఅయిన పరిస్థితి. గుజరాత్ లోని పాటన్ జిల్లా జఖోట్రా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక అమాయకుడు బలయ్యాడు. ఇంతకూ అసలేం జరిగిందంటే గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల వివాహిత గీతా అహిర్ కు 21 ఏళ్ల భరత్ తో వివాహేతర సంబంధం ఉంది. భర్తను వదిలేసి.. ప్రియుడితో కలిసి రాజస్థాన్ కు వెళ్లిపోయి గుట్టుగా బతికేయాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఒక ప్లాన్ వేసింది. తన స్థానంలో మరొకరిని చంపేసి.. తాను చనిపోయినట్లుగా అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేసి.. తాను తన ప్రియుడితో వెళ్లిపోతే మళ్లీ తనను ఎవరూ గుర్తించరని భావించింది.

ఇందుకు అవసరమైన ఒక శవం కోసం అర్థరాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న 56 ఏళ్ల హర్జీభాయ్ సోలంకీని భరత్ చేత చంపించింది. గీతా వేసిన ప్లాన్ కు తగ్గట్లే.. ఆ శవాన్ని మంగళవారం రాత్రి గీత ఉండే గ్రామానికి తీసుకొచ్చాడు. అందరూ నిద్రపోయాక ఇంటి నుంచి ప్రియుడితో కలిసి బయటకు వచ్చి.. శవానికి తన దుస్తుల్ని తొడిగింది. కాళ్లకు తాను ధరించే గజ్జెల్ని తొడిగింది.

ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి ఇద్దరూ కలిసి పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇది తన శవమే అనుకుంటారని గీత భావించింది. అర్థరాత్రి తర్వాత గీత ఇంట్లో లేదన్న విషయాన్ని గుర్తించి ఆమె కోసం వెతకటం మొదలు పెట్టారు. కాలిన శవాన్ని చూసిన తర్వాత తన గురించి వెతకటం ఆపేస్తారనిగీత భావించింది. కాకుంటే.. వారు కాల్చిన శవం కొంతమేర మాత్రమే కాలటం.. దుస్తులు మహిళవి ఉన్నా.. చనిపోయింది పురుషుడు కావటంతో పోలీసులకు సందేహం వచ్చింది.

వెంటనే.. గీత ఆచూకీ కోసం వెతకటం షురూ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జోధ్ పుర్ కు వెళ్లేందుకు పాలన్ పుర్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్న గీత.. భరత్ లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తాను ప్లాన్ చేసిన మొత్తం విషయాల్ని చెప్పటమే కాదు.. తనకు స్ఫూర్తిగా దృశ్యం.. దృశ్యం 2 సినిమాలు నిలిచినట్లుగా చెప్పటంతో పోలీసులు అవాక్కైన పరిస్థితి.