మంచోడిలా నటిస్తూ.. విదేశీయురాలిపై అఘాయిత్యం
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జర్మన్ దేశస్తురాలిపై అఘాయిత్యం చేసిన దారుణ ఉదంతంలో నిందితుడి నుంచి పోలీసులు పలు వివరాల్ని సేకరించారు.
By: Tupaki Desk | 3 April 2025 10:30 AM ISTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జర్మన్ దేశస్తురాలిపై అఘాయిత్యం చేసిన దారుణ ఉదంతంలో నిందితుడి నుంచి పోలీసులు పలు వివరాల్ని సేకరించారు. ప్లాన్ ప్రకారం ఆమెపై కన్నేసిన నిందితుడు.. మంచోడిలా నటిస్తూ ఆమెను మోసం చేశాడు. ఈ కేసు విచారిస్తున్న పోలీసులు నిందితుడిని లోతుగా విచారించారు. ఈ క్రమంలో అతడి గతానికి సంబంధించిన షాకింగ్ నిజం వెలుగు చూసింది. గతంలో అతడు 19 ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి కేసులో యాకుత్ పుర పోలీసులకు చిక్కాడు. అయితే.. 2022లో ఈ కేసును కోర్టు కొట్టేసిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు.
ఆ తర్వాత దుబాయ్ కు వెళ్లిన నిందితుడు అస్లాం కారు డ్రైవర్ గా పని చేశాడు. నమ్మకంగా వ్యవమరించటం..వినయ విధేయతలు ప్రదర్శించటం.. మంచివాడిలా బిల్డప్ ఇవ్వటం.. అమ్మాయిల్ని ట్రాప్ చేసే విషయంలో అతగాడికి ఉన్న టాలెంట్ పోలీసులు సైతం విస్మయానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.
ఏడాది క్రితం హైదరాబాద్ కు తిరిగి వచ్చిన పాతికేళ్ల అస్లాం.. ఒక పార్టీ నేతగా గుర్తించారు. మార్చి 31న రంజాన్ సందర్భంగా సెల్ఫ్ డ్రైవ్ కారును అద్దెకు తీసుకొని తన కాలనీకి చెందిన కొందరు బాలల్ని వెంట పెట్టుకొని కారులో తిరిగాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద అతడికి జర్మన్ యువతి.. ఆమె స్నేహితుడు కనిపించారు.కారులో పిల్లలతో ఫ్యామిలీ మ్యాన్ లా నటిస్తూ వారిని పరిచయం చేసుకున్నాడు.
ఆ తర్వాత వారిని కారులో ఎక్కించుకొని మామిడిపల్లి గ్రామ సమీపానికి తీసుకెళ్లాడు.కారులో ఉన్న మైనర్లను.. యువతి స్నేహితుడ్ని కారు నుంచి దింపి.. వారిని సెల్ఫీలు తీసుకొమ్మని ప్రోత్సహించి.. దగ్గర్లో యూటర్న్ తీసుకొస్తానని చెప్పి యువతిని తనతో తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆయుధంతో ఆమెను బెదిరించి.. తాను చెప్పినట్లు వినకుండా చంపేస్తానని చెప్పిఅఘాయిత్యానికి పాల్పడినట్లుగా తేల్చారు.
నిందితుడ్ని రిమాండ్ కు పంపుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడ్ని కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు ఈ రోజు (గురువారం) జర్మనీ వెళ్లిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంగళవారం ఆమెను జడ్జి వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలాన్ని రికార్డు చేయించారు. ఆమె స్నేహితుడి చేత కూడా వాంగ్మూలాన్ని ఇప్పించారు. క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమైతే వర్చువల్ హాజరుతో బాధితురాలితో మాట్లాడిస్తామన్న అధికారులు.. ఈ ఉదంతంలో న్యాయమూర్తిని కూడా ఒక సాక్షిగా పరిగణిస్తారని చెబుతున్నారు.
