Begin typing your search above and press return to search.

భర్త వివాహేతర సంబంధం.. హత్య చేయించిన భార్య

పట్టణానికి చెందిన బిల్డర్ కం రియల్ ఎస్టేట్ యజమాని ప్రవీణ్ (42) అనుమానాస్పద మరణంపై పోలీసుల క్లారిటీకి వచ్చేశారు

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:35 AM GMT
భర్త వివాహేతర సంబంధం.. హత్య చేయించిన భార్య
X

సవాలచ్చ కారణాలు ఉండొచ్చు. అంత మాత్రానికే చంపేయటమే అన్నింటికి పరిష్కారం కాదు కదా? ఈ చిన్న లాజిక్కును మిస్ అయిన ఒక భార్య చేసిన దారుణ ప్లానింగ్ గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ప్రాణం తీయటం తేలికేమో కానీ.. తీసినోళ్లు తప్పించుకునే అవకాశాలు మాత్రం అస్సలే ఉండవన్న విషయం క్రైం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెబుతుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది.

పట్టణానికి చెందిన బిల్డర్ కం రియల్ ఎస్టేట్ యజమాని ప్రవీణ్ (42) అనుమానాస్పద మరణంపై పోలీసుల క్లారిటీకి వచ్చేశారు. అతడి మరణంపై తమకొచ్చిన ఫిర్యాదు ఆధారంగా తీగ లాగిన పోలీసులకు డొంక మొత్తం కదలటమే కాదు.. అతగాడిది హత్యగా విచారణలో తేల్చారు. అంతేకాదు.. ప్రవీణ్ భార్య లలితతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ భర్తను భార్య ఎందుకు చంపించింది? ఇందులో భాగంగా జరిగిన ప్లానింగ్ గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్ బిల్డర్ ప్రవీణ్ కు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట ఇద్దరు కుమార్తెలు కాగా.. మూడో సంతానం బాబు. వారి వయసు 14, 12, 10 సంవత్సరాలు. కొన్నేళ్లుగా ఒక మహిళతో ప్రవీణ్ కు వివాహేతర సంబంధం ఏర్పడిందన్న విషయాన్ని భార్య లలిత తెలుసుకుంది. అప్పటి నుంచి వారి దాంపత్య జీవితంలో గొడవలు మొదలయ్యాయి. ఆమెతో సంబంధాలు తుంచుకోవాలని కోరేది. అయినప్పటికీ భర్తలో ఎలాంటి మార్పు లేకపోవటంతో... అతడ్ని హత్య చేయించాలని డిసైడ్ అయ్యింది.

ఇందులో భాగంగా ప్రవీణ్ దగ్గర సెంట్రింగ్ పని చేసే 37 ఏళ్ల సురేశ్ తో డీల్ కుదుర్చుకుంది. తన భర్తను హత్య చేస్తే ఒక ప్లాట్ ఇస్తానని చెప్పటంతో అతడు ఒప్పేసుకున్నాడు. హత్య చేసేందుకు తనతో పాటు సతీశ్, శ్రీనివాస్, గణేశ్ లతో కలిసి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పాముతో కాటు వేయించాలన్న పథకంలో భాగంగా.. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేసే చంద్రశేఖర్ తో మాట్లాడుకున్నారు.

వీరికి అయ్యే ఖర్చుల కోసం లలిత తన వద్ద ఉన్న 34 గ్రాముల బంగారు గొలుసును అడ్వాన్సు కింద ఇచ్చేసింది. తమ హత్య పథకాన్ని అమలు చేసేందుకు ఈ నెల 9న డిసైడ్ చేసుకున్న వారు మద్యం సేవించి.. మూడు వాహనాల్లో లలిత ఇంటికి చేరుకున్నారు. నిద్ర పోతున్న భర్తను చూపించిన లలిత.. తాను వేరే గదిలోకి వెళ్లిపోయింది. నిందితులు ప్రవీణ్ ముఖం మీద దిండుతో అదిమి పెట్టారు. కాసేపు పెనుగులాడిన ప్రవీణ్ లో కదలికలు నిలిచిన వెంటనే.. తమతో తెచ్చుకున్న పాముతో కాటు వేయించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తమతో తెచ్చిన పామును బయట వదిలేసి వెళ్లిపోయారు.

తన భర్త గుండెపోటుతో మరణించినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసింది లలిత. అయితే.. ప్రవీణ్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మరణం మీద సందేహాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు రంగంలోకి దిగారు. తమకున్న సందేహాలకు సమాధానాలు వెతికే క్రమంలో మొత్తం కుట్ర కోణం బయటకు వచ్చింది. దీంతో.. భార్య లలితతో పాటు.. ప్రవీణ్ హత్యలో పాల్గొన్న వారందరిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిని రిమాండ్ కు తరలించారు. తప్పుడు మార్గంలో వెళ్లిన భర్తను తిరిగి తన వద్దకు తెచ్చుకోవటమో.. కుదరదంటే.. తనకున్న హక్కుల ద్వారా భర్త నుంచి దూరంగా వెళ్లాలే తప్పించి.. హత్య చేయించాలన్న దుర్మార్గ ఆలోచన.. చివరకు ఆమెను సైతం జైలుపాలు అయ్యేలా చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏ మాత్రం సంబంధం లేని పిల్లలు బలిపశువులుగా మారటం ఆవేదన కలిగించే అంశంగా చెప్పకతప్పదు.