Begin typing your search above and press return to search.

నమ్మించినంత సులువుగా నట్టేట్లోకి తోశాడు... అసలేంజరిగింది?

ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఆ వ్యక్తి కూడా తాడేపల్లిలోని ఓ హోటల్‌ లో పనిచేస్తున్నాడు

By:  Tupaki Desk   |   8 Aug 2023 8:32 AM GMT
నమ్మించినంత సులువుగా నట్టేట్లోకి తోశాడు... అసలేంజరిగింది?
X

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. కూతురుతో కలిసి ఉంటున్న ఒక మహిళ... మరో వ్యక్తితో చేసిన సహజీవన ఫలితం ఇలా విషాదాంతమైంది.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... భర్తతో విభేదాల వల్ల ఒక మహిళ (36) ఉమ్మడి కృష్ణాజిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్‌ లో పనిచేస్తూ కుమార్తె (13)తో కలిసి జీవిస్తోంది. ఈ సమయంలో ఆ మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు ఒక వ్యక్తి.

ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఆ వ్యక్తి కూడా తాడేపల్లిలోని ఓ హోటల్‌ లో పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైంది. అయినా ఈ మహిళను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. దీంతో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. అనంతరం ఒక పాప జన్మించింది. తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు.

ఆ బిడ్డ తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్‌ పేటలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తరుచూ వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. దీంతో ఆ మహిళ తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్‌ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్‌ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది.

ఈ నేపథ్యంలో షాపింగ్ చేయిస్తానని నమ్మించి ఆ మహిళతోపాటు ఇద్దరు కుమార్తెలనూ తీసుకుని కారులో రాజమహేంద్రవరం.. అక్కడి నుంచి రావులపాలెం తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు.

ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ ఆ మహిళను బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. మహిళతో పాటు చిన్న కుమార్తెనూ గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్‌ లో పాటలు వింటున్న పెద్ద కూతురుని కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత కారులో పరారయ్యాడు.

ఈ సమయంలో బ్రిడ్జిపై నుంచి పడిపోతున్న సమయంలో ఆ బాలిక బ్రిడ్జికి ఉన్న కేబుల్‌ పైపును బలంగా పట్టుకుంది. ఆ సమయంలో సమయస్పూర్తిగా తన వద్ద ఉన్న ఫోన్‌ తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్‌ కు డయల్‌ చేసింది. అప్రమత్తమైన హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు.

అనంతరం ఆ బాలికకు ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ మహిళ, చిన్న కూతురు ఆచూకీ కోసం బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది.