Begin typing your search above and press return to search.

వామ్మో... ఏప్రిల్ 22 తర్వాత భారత్ లో ఇన్ని కోట్ల సైబర్ దాడులా?

ఇక తాజాగా (మే 10) న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినా.. భారత్ పై సైబర్ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   12 May 2025 6:04 PM
వామ్మో... ఏప్రిల్ 22 తర్వాత భారత్  లో ఇన్ని కోట్ల సైబర్  దాడులా?
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశం మొత్తం ఆ ఉగ్రదాడి, దానికి భారత్ చేయబోయే ప్రతీకార చర్యలపై తీవ్ర చర్చలు జరిగేవి! ఆ సంగతి అలా ఉంటే.. నాటి నుంచి దేశంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోయాయని తెలుస్తోంది. ఆ నెంబర్ షాకింగ్ గా ఉంది!

అవును... పహల్గం ఉగ్రదాడి (ఏప్రిల్ 22) నుంచి మొదలు భారత్ లో సైబర్ దాడులు విపరీతంగా పెరిగాయని తెలుస్తోంది. ఇక తాజాగా (మే 10) న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినా.. భారత్ పై సైబర్ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర సైబర్ విభాగం సంచలన విషయాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా.. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ లో 1.5 కోట్ల సైబర్ దాడులు చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. వీటిలో 150 విజయవంతమైనట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ తో పాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ సీనియర్ ఆఫీసర్... ఏప్రిల్ 22 తర్వాత భారీస్థాయిలో డిజిటల్ దాడులు పెరిగాయని, భారత వెబ్ సైట్లు, పోర్టల్స్ ను లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్, పశ్చిమాసియా, ఇండోనేషియా హ్యాకర్లు చెలరేగిపోయారని తెలిపారు!

ఈ క్రమంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారని.. ఎన్నికల సంఘం వెబ్ సైట్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని తెలిపారు. ఇప్పటికీ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా,మొరాకో దేశాల నుంచి సైబర్ దాడులు ఎదురవుతూనే ఉన్నాయని వెల్లడించారు.

ఇక... ఎవరైనా సైబర్ దాడులకు గురైతే పానిక్ అవ్వకుండా.. బాధితులు ముందుగా 1945, 1930 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.