గడిచిన కొంతకాలంగా దేశంలో జరుగుతున్న కొన్ని నేరాలు విస్మయానికి గురి చేయటమే కాదు.. అసలు మనం ఏ తీరులో వెళుతున్నాం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బంధాల మధ్య సంబంధాల తీరు మారిపోవటమే కాదు.. ఊహించటానికి వీల్లేని అంశాలు కొన్ని దారుణ నేరాలుగా మారుతున్నాయి.
తాజాగా ఆ కోవలోకే వస్తుంది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో చోటు చేసుకున్న పదో క్లాస్ విద్యార్థి దారుణ హత్య. దారుణంగా హతమార్చిన అనంతరం.. ఆ తప్పును తప్పుదారి పట్టించేందుకు కిడ్నాప్ నాటకాన్ని ఆడిన వైనం ఒక ఎత్తు అయితే.. అసలీ హత్యకు పాల్పడింది విద్యార్థి ట్యూషన్ కు వెళ్లే టీచరు ప్రియుడే కావటం మొత్తం ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్టుగా చెప్పాలి.
పదో తరగతి చదివే విద్యార్థి కాన్పూరులోని రజిత అనే టీచర్ వద్దకు ట్యూషన్ కు వెళుతుంటాడు. అయితే.. అతనికి.. టీచర్ రజితకు మధ్య వివాహేతర సంబంధం ఉందని సదరు లేడీ టీచర్ ప్రియుడు అనుమానించాడు. దీంతో.. అతన్ని ట్యూషన్ కోసం టీచరు పిలుస్తున్నట్లుగా చెప్పి.. అతన్ని ఒక గదిలోకి తీసుకొచ్చి దారుణంగా హతమార్చారు. అయితే.. తమ హత్యను కప్పి పుచ్చుకోవటానికి మరో నాటకానికి తెర తీశారు.
హత్య అనంతరం.. విద్యార్థిని కిడ్నాప్ చేసినట్లుగా కలర్ ఇచ్చే ప్రయత్నం చేసి.. కిడ్నాప్ అయిన విద్యార్థిని ఇంటికి క్షేమంగా తీసుకురావాలంటే పెద్ద ఎత్తున మొత్తాన్ని డిమాండ్ చేస్తూ.. ఒక లేఖను విద్యార్థి ఇంటి ముందు పడేశారు.
అంతేకాదు.. సదరు లేఖలో అల్లా.. అక్బర్ అని పేర్కొనటం ద్వారా పోలీసుల్ని బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారు. ఈ హత్య కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
అంతేకాదు.. డెడ్ బాడీ నిందితుడి ఇంట్లో గుర్తించటం.. అతడ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించటంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ ఎపిసోడ్ లో ట్యూషన్ టీచర్ రజిత పాత్ర ఏమిటి? అన్న దానిపై తదుపరి విచారణలో బయటకు వెల్లడవుతుందని భావిస్తున్నారు.