Begin typing your search above and press return to search.

సీఐ మర్డర్ కేసులో కానిస్టేబుల్ దంపతులు అరెస్టు

తాజాగా ఈ హత్యకు కారణమైన కానిస్టేబుల్ దంపతుల్ని అరెస్టు చేయటంతో పాటు.. వారికి సహకరించిన మరొకరు మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:15 AM GMT
సీఐ మర్డర్ కేసులో కానిస్టేబుల్ దంపతులు అరెస్టు
X

రోడ్డు మీద అనుమానాస్పద రీతిలో తీవ్ర గాయాల బారిన పడిన మహబూబ్ నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ దారుణ హత్యకు సంబంధించి మిస్టరీ వీడింది. తాజాగా ఈ హత్యకు కారణమైన కానిస్టేబుల్ దంపతుల్ని అరెస్టు చేయటంతో పాటు.. వారికి సహకరించిన మరొకరు మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఇంతకూ సీఐ అహ్మద్ ను ఎందుకు హత్య చేశారు? అన్న విషయంలోకి వెళితే.. పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా వ్యవహరిస్తున్నాడు జగదీశ్. అతడి సతీమణి శకుంతల ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్సెల్ లో పని చేస్తుంటారు. 2009 బ్యాచ్ కు చెందిన వీరు 2011లో లవ్ మ్కారేజ్ చేసుకున్నారు. 2018లో ఎస్పీ ఆఫీసులో డీసీఆర్ బీ సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్ కు.. అప్పట్లో మహిళా పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ గా పని చేసే శకుంతలతో పరిచయం ఉండేది. ఆ తర్వాత కాలంలో ట్రాన్స్ ఫర్ పై అహ్మద్ వెళ్లిపోయారు.

గత ఏడాది డిసెంబరులో తిరిగి మహబూబ్ నగర్ కు వచ్చారు. అప్పటి నుంచి కానిస్టేబుల్ శకుంతల ఫోన్ కు మెసేజ్ లు పంపేవాడు. దీంతో.. తనకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి భర్తకు శకుంతల చెప్పింది. ఈ నేపథ్యంలో మార్చి 8న తన భార్యతో కలిసి సీఐ అహ్మద్ వద్దకు వెళ్లిన భర్త జగదీశ్.. సీఐకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భార్య విషయంలో ఆయన పద్దతిని మార్చుకోవాలని చెప్పారు. అయినప్పటికి సీఐ అహ్మద్ తన ప్రవర్తనను పెద్దగా మార్చుకోలేదని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే జగదీశ్.. శకుంతల ఇంట్లో సహాయం చేసేందుకు క్రిష్ణ అనే యువకుడు పని చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి క్రిష్ణ వారితోనే పెరుగుతూ.. ఇంటి పనుల్లో సాయంగా ఉండేవాడు. ఇదిలా ఉంటే ఈ నెల ఒకటి రాత్రి జగదీశ్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీకి వెళుతూ.. ఇంటికి ఎవరైనా వస్తే ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పాడు. అదే రోజు రాత్రి ఇంటికి వస్తానని శకుంతలకు మెసేజ్ పెట్టాడు సీఐ అహ్మద్. ఇంట్లోనే తన భర్త ఉన్నట్లుగా శకుంతల రిప్లై ఇచ్చింది.అయినప్పటికీ రాత్రి 11.20 గంటల వేళలో.. వారు నివసించే ఇంటి సమీపానికి కారులో వచ్చిన సీఐ అహ్మద్.. కాస్తంత దూరంలో కారును పార్కు చేశాడు.

అనంతరం నడుచుకుంటూ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఈ విషయాన్ని గమనించిన క్రిష్ణ.. ఇంటికి వచ్చిన అహ్మద్ గురించి కానిస్టేబుల్ జగదీశ్ కు సమాచారం ఇచ్చాడు. తలుపు తీసి సీఐతో శకుంతల మాట్లాడుతున్న వేళలోనే.. ఆవేశంతో అక్కడకు వచ్చిన జగదీశ్.. సీఐపైకి దాడికి పాల్పడ్డాడు. క్రిష్ణకూడా అతడికి సహకరించాడు. వారిని తోసేసి.. రోడ్డు మీదకు వచ్చిన సీఐ మీద మళ్లీ దాడికి పాల్పడటంతో.. అతను స్ప్రహ కోల్పోయాడు.

అనంతరం సీఐ అహ్మద్ ను అతడి కారులోనే వెనుక సీటులో కూర్చెబెట్టి..దగ్గర్లో ఖాళీ ప్లేస్ చూసి రావాలంటూ క్రిష్ణకు చెప్పి తిరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయాడు. స్టేషన్ లో తాను సిబ్బందితో కలిసి ఉన్న ఫోటోను అంత రాత్రి వేళ పోలీసు గ్రూపులో పోస్టు చేశాడు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కారు నిలిపిన ప్లేస్ కు వెళ్లిన జగదీశ్.. సీఐను కారులో నుంచి దించి పెద్ద రాయితోతలపై మోదారు. సీఐ దుస్తులు తీసేసి కత్తితో ఒంటిపై విచక్షణరహితంగా పొడిచాడు.

అనంతరం ఆ కత్తిని డ్రైనేజీలో పడేశాడు. ఇంటికి వెళ్లి.. భార్య శకుంతలకు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో.. రక్తం మరకులు ఉన్న వారి దుస్తుల్ని తీసేసి కాల్చేసింది. ఆధారాలు దొరక్కుండా చేసిన ఆమె.. ఉదయాన ఆమె అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో.. ఈ విషయాన్ని పోలీసు అధికారులకు సమాచారం అందించాల్సిందిగా సలహా ఇచ్చాడు. అనంతరం జిల్లా ఎస్పీకి.. సీఐకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అనంతరం ముగ్గురు ఇంట్లో నుంచి పరారయ్యారు.

మరోవైపు.. తీవ్రమైన గాయాల బారిన పడిన సీఐ అహ్మద్ ను.. అటువైపుగా ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లే వారు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అతడ్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన సీఐ అహ్మద్.. తాజాగా ప్రాణాలు వొదిలాడు. అదే సమయంలో కానిస్టేబుల్ దంపతులు.. క్రిష్ణ కోసం గాలిస్తున్న పోలీసులు.. పోలీసు దంపతుల్ని అరెస్టు చేశారు. క్రిష్ణ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.