Begin typing your search above and press return to search.

వేలిముద్రలకు గాలం... భారీగా బయటపడుతున్న సైబర్ మోసం!

తాజాగా వేలిముద్రలతో జరుగుతున్న సరికొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 8:51 AM GMT
వేలిముద్రలకు గాలం... భారీగా బయటపడుతున్న సైబర్ మోసం!
X

కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే ఎన్నో రకాల సైబర్ నేరాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో తాజాగా వేలిముద్రలతో జరుగుతున్న సరికొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నెంబర్, వేలిముద్రలతో ఈ దందా సాగుతుంది. మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది.

అవును... సైబర్‌ మోసగాళ్ల గురి ఇప్పుడు వేలిముద్రలపై పడింది. ప్రజల వేలిముద్రలతో కూడిన పత్రాల్ని కొట్టేసి నకిలీవి సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో బాధితులు ఈ తరహా మోసానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి వెలుగులోకి వస్తోన్న విషయాలు షాకింగ్ గా ఉన్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవల్ని అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన ఆధార్‌ ఎనేబుల్డ్ పేమెంట్‌ సిస్టమ్‌(ఏఈపీఎస్‌)లోని లొసుగులతో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ వ్యవస్థలో ఖాతాదారును ధ్రువీకరించుకునేందుకు ఆధార్‌ నంబరును, బయోమెట్రిక్‌ ను ఆథెంటికేషన్‌ గా తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా... ఖాతాదారు తన వేలిముద్రను ఏజెంట్‌ వద్ద గల యంత్రంలో వేస్తే అతడి బ్యాంకు ఖాతాలోని నగదు వివరాలు తెలుస్తాయి. ఈ క్రమంలో... ప్రభుత్వరంగ బ్యాంకులు రోజుకు రూ.10వేల వరకు.. ప్రైవేటు బ్యాంకులు రూ.10లక్షల వరకు ఏఈపీఎస్‌ ట్రాంజేక్షన్స్ ని అనుమతిస్తున్నాయి. ఈవ్యవస్థలో భాగంగా కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌(సీఎస్‌పీ)ల ఏర్పాటుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి.

దీంతో సైబర్‌ నేరస్థులు అక్కడక్కడ తామే సీఎస్‌పీ ఏజెంట్లుగా అవతారమెత్తారు. ఏజెంట్‌ గా నమోదు చేసుకునేందుకు కరెంట్‌ అకౌంట్ అవసరం తప్పనిసరి కాకపోవడం.. ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలనే నిబంధన లేకపోవడం.. దరఖాస్తు సమయంలో ఈ ఏజెంట్ల గురించి వెరిఫికేషన్ చేసే వ్యవస్థ లేకపోవడం వారికి అన్ని రకాలుగా కలిసివస్తోంది.

ఈ సమయంలో సీ.ఎస్‌.పీలో లావాదేవీల నిర్వహణకు ఆధార్‌ నంబర్‌ తోపాటు బయోమెట్రిక్‌ ఆథెంటికేషన్‌ అవసరం కావడంతో ఈ వివరాలు సంపాదించేందుకు ప్రభుత్వశాఖల్లోని లావాదేవీలపై మోసగాళ్లు కన్నేశారు. ఇందులో భాగంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ లోని వేలిముద్రల పత్రాల్ని డౌన్‌ లోడ్‌ చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో... పేపర్‌ పై ఉన్న వేలిముద్రలను సేకరించేందుకు తొలుత బటర్‌ పేపర్‌ ను వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తర్వాత దానిద్వారా గాజుగ్లాస్‌ పైన వాటిని ముద్రిస్తారు. దానిపై రబ్బర్‌ పోస్తే పాలిమర్‌ ప్రింట్‌ తయారవుతుంది.. అదే నకిలీ వేలిముద్ర! సీ.ఎస్‌.పీ లో బయోమెట్రిక్‌ యంత్రంలో ఆ నకిలీ వేలిముద్రల్ని పెట్టి బ్యాంకు ఖాతాలలోని నగదును విత్‌ డ్రా చేసేస్తున్నారు.

ఇలా ఆధార్‌ ను వినియోగించి ఖాతాలో డబ్బును కాజేస్తే వెంటనే 1930 నంబర్‌ కు ఫిర్యాదు చేయాలి. బాధితుల ప్రమేయం లేకుండా డబ్బు పోతే చాలా ఉదంతాల్లో ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారని తెలుస్తోంది.