Begin typing your search above and press return to search.

కంబోడియాలో 105 మంది ఇండియన్స్ అరెస్టు... ఏమి చేస్తున్నారో తెలిస్తే షాకే!

ప్రపంచవ్యాప్తంగా.. ప్రధానంగా.. భారత్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న సైబర్ నేరాలకు కేరాఫ్ కంబోడియా అనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 July 2025 9:00 PM IST
కంబోడియాలో 105 మంది ఇండియన్స్  అరెస్టు... ఏమి చేస్తున్నారో తెలిస్తే షాకే!
X

ప్రపంచవ్యాప్తంగా.. ప్రధానంగా.. భారత్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న సైబర్ నేరాలకు కేరాఫ్ కంబోడియా అనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి తీసుకెళ్లి.. టార్గెట్స్ ఇచ్చి మరీ సైబర్ నేరాలు చేయిస్తున్నారని అంటారు. మరికొంతమంది దీన్ని వృత్తిగా ఎంచుకున్నట్లు చెబుతారు. ఈ సమయంలో 105 మంది భారతీయులు దొరికేశారు.

అవును... సైబర్ నేరస్థులు లేదా ఆన్‌ లైన్ మోసగాళ్లపై కంబోడియా అధికారులు భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా... 15 రోజుల్లో 138 ప్రదేశాలలో నిర్వహించిన ఈ దాడుల్లో ఇప్పటివరకూ మొత్తం 3,075 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 606 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో... అరెస్టు చేయబడిన భారతీయుల పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది.

అయితే... ఈ దాడుల్లో అరెస్టైన వారిని తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కంబోడియా అధికారులతో చర్చలు జరుపుతోందని అంటున్నారు. ఈ దాడుల్లో భారతీయులతో పాటు చైనీయులు, వియత్నామీస్, ఇండోనేషియా పౌరులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా... కంబోడియా ప్రాంతం సైబర్ నేరాలకు, ఆన్ లైన్ మోసాలకు అడ్డాగా మారిందని అంటున్నారు.

కాగా... గత నెలలో భారత్, కంబోడియా మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల అనంతరమే అక్కడి అధికారులు ఈ చర్య చేపట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంతో సహా వివిధ దేశాల వ్యక్తులు కంబోడియాలో కూర్చొని సైబర్ నేరాలు చేస్తున్నారని.. వేల కోట్లు కొల్లగొడుతున్నారని అంటున్నారు.

ఈ తాజా దాడుల్లో... వీరితో పాటు కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌ లు, మొబైల్ ఫోన్‌ లు, డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... భారత్, చైనా పోలీసుల నకిలీ యూనిఫాంలు, డ్రగ్స్ ప్రాసెసింగ్ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడినవారి వివరాలు దేశాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

చైనా - 1,028

వియత్నాం - 693

ఇండోనేషియా - 366

ఇండియా - 105

బంగ్లాదేశ్ - 101

థాయిలాండ్ - 82

పాకిస్థాన్ = 81

కొరియా - 57

నేపాల్ - 13

మలేషియా - 4

తో పాటు రష్యా, మయన్మార్, ఫిలిప్పీన్స్, కామెరూన్, నైజీరియా, ఉగాండా, లావోస్, సియెర్రా లియోన్, మంగోలియా పౌరులను కూడా అరెస్టు చేశారు.