Begin typing your search above and press return to search.

బెజవాడ కుర్రాడు.. మేనత్తను చంపేసి గోవాలో పార్టీ

బీటెక్ చదువుతున్న ఒక కుర్రాడు రాక్షసుడి తరహాలో వ్యవహరించిన తీరుకు పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి

By:  Tupaki Desk   |   1 March 2024 4:52 AM GMT
బెజవాడ కుర్రాడు.. మేనత్తను చంపేసి గోవాలో పార్టీ
X

బీటెక్ చదువుతున్న ఒక కుర్రాడు రాక్షసుడి తరహాలో వ్యవహరించిన తీరుకు పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. రీల్ నటులకు మించిన ఈ రియల్ నేరగాడి ఫెర్ ఫార్మెన్స్ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. చిన్న అప్పు కోసం మేనత్తను చంపేసి.. నిర్దాక్షిణ్యంగా ఆ శవాన్ని మాయం చేయటమే కాదు.. గుట్టు చప్పుడు కాకుండా స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లి పార్టీ చేసుకున్న వైనం తెలిస్తే ఒళ్లు జలదరించాల్సిందే. బెజవాడ బీటెక్ విద్యార్థి జస్వంత్ రెడ్డిని తాజాగా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే..

బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీకి సమీపంలోని దొడ్డతొగూరులో సుకన్య.. ఆమె భర్త నివాసం ఉంటున్నారు. ఫిబ్రవరి 13న తన భార్య హౌస్ కీపింగ్ జాబ్ చేస్తుందని.. ఆమె పనికి వెళ్లి తిరిగి రాలేదంటూ భర్త నరసింహారెడ్డి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సుకన్య కాల్ డేటాను బయటకు తీశారు. ఈ క్రమంలో ఆమె జశ్వంత్ రెడ్డి అనే యువకుడి నుంచి ఆమెకు ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 12న సుకన్యతో పాటు జశ్వంత్ మొబైల్ సిగ్నల్స్ కేఆర్ పురం సమీపంలో ఉన్నట్లుగా తేల్చారు.

దీంతో.. జశ్వంత్ రెడ్డి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేశారు. అతడు సుకన్య మేనల్లుడని గుర్తించి అతడ్ని అరెస్టు చేశారు. విజయవాడలో బీటెక్ థర్డ్ ఇయర్ చదివే అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తనకేమీ తెలీదని బుకాయించాడు. దీంతో.. తాము సేకరించిన సాంకేతిక అంశాలు.. ఆధారాలను (కాల్ డేటా, టవర్ లొకేషన్) చూపించగా తడబడ్డాడు. తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాన్ని వెల్లడించాడు.

ఫిబ్రవరి 12న అద్దె కారులో మేనత్త సుకన్య కలిసేందుకు బెంగళూరు వెళ్లానని.. తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. తనకు డబ్బు కావాలని అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని ఆమె చెప్పింది. దీంతో.. ఆమెను మాయమాటల్లో పెట్టి ఇంటి దగ్గర దింపుతానని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి.. ఆమె గొంతు నులిమి మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్ తీసుకున్నాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకొని ఆమె డెడ్ బాడీని బింగిపుర సమీపంలో పడేశాడు. అక్కడి నుంచి హోసూరుకు వెళ్లి.. ఐదు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి డెడ్ బాడీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. బెంగళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వచ్చి రూ.95 వేలకు బంగారు చైన్ ను అమ్మేశాడు. ఆ డబ్బులో రూ.50వేలు తీసుకొని అప్పు తీర్చాడు. మిగిలిన డబ్బులతో విజయవాడ వెళ్లిపోయాడు.

అనంతరం స్నేహితులతో గోవాకు వెళ్లి పార్టీ చేసుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా రోజూ కాలేజీకి వెళ్లసాగాడు. టెక్నికల్ అంశాల ఆధారంగా జస్వంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన ఆధారాలతో సుకన్యను కాల్చేసిన ప్రదేశానికి వెళ్లి.. కొన్ని ఎముకల్ని.. కాలిపోయిన కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.50వేల కోసం వెళ్లి.. మేనత్తను హత్య చేయటం షాకింగ్ గా మారింది. పోలీసుల విచారణలో మరో విషయం కూడా బయటకు వచ్చింది. గత ఏడాది అక్టోబరులో జశ్వంత్ రెడ్డి వేరే వారి వాహనాన్ని తీసుకెళ్లి.. రోడ్డు యాక్సిడెంట్ చేశాడు. ఎలాంటి కేసు పెట్టొద్దని.. వెహికిల్ డ్యామేజ్ కావటంతో రూ.50 వేలు ఇస్తానని యజమానికి చెప్పాడు. ఆ డబ్బుల కోసమే మేనత్త సుకన్యను హత్య చేశాడు.