Begin typing your search above and press return to search.

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

ఈ దాడి వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లున్నారనే వాదనలపై కూడా ఇప్పటివరకు బినాన్స్‌ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు.

By:  Tupaki Desk   |   30 Oct 2026 11:48 AM IST
మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!
X

ప్రపంచంలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌లలో ఒకటైన బినాన్స్‌ భారీ సైబర్‌ దాడిని ఎదుర్కొంది. ఈ ఘటనలో సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులపై ప్రభావం పడినట్లు సంస్థ వెల్లడించింది. ఇది క్రిప్టో రంగంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద హ్యాక్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉందని ఫోర్బ్స్‌ తన కథనంలో పేర్కొంది.

బినాన్స్‌ ప్రాథమిక విచారణ ప్రకారం, సంస్థకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ల్యాప్‌టాప్‌ హ్యాక్‌కు గురై ఉండవచ్చని, దాని ద్వారా దుండగులు కంపెనీ సిస్టమ్‌లోకి ప్రవేశించి అనధికారికంగా క్రిప్టో విత్‌డ్రాయల్స్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో వాలెట్‌ ప్రైవేట్‌ కీలు లీక్‌ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని బినాన్స్‌ స్పష్టం చేసింది.

ఈ ఘటనలో ప్రభావితమైన ఆస్తుల్లో సుమారు 3 బిలియన్ డాలర్లను బ్లాక్‌చైన్‌ భాగస్వాముల సహకారంతో ఫ్రీజ్‌ చేసినట్లు సంస్థ తెలిపింది. మిగిలిన ఆస్తుల గుర్తింపు, రికవరీ కోసం సంబంధిత సంస్థలు, చట్ట అమలు విభాగాలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన బినాన్స్‌.. వినియోగదారులకు జరిగిన నష్టాన్ని SAFU ఫండ్‌, కంపెనీ నిధుల ద్వారా పూర్తిగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. భద్రతా చర్యలు పూర్తయ్యాక తాజా Proof of Reserves వివరాలను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

6.3 బిలియన్ డాలర్ల విలువ భారత కరెన్సీలో సుమారు రూ.57,000 కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ మొత్తం పూర్తిగా దొంగిలించబడిందని చెప్పడం సరైంది కాదు. బినాన్స్‌ వెల్లడించినది ఈ ఘటన వల్ల ప్రభావితమైన ఆస్తుల అంచనా విలువ. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

ఈ దాడి వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లున్నారనే వాదనలపై కూడా ఇప్పటివరకు బినాన్స్‌ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. దాడికి పాల్పడిన వారి గుర్తింపును తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.