Begin typing your search above and press return to search.

డిజిటల్ అరెస్టు బెదిరింపులకు భయపడి ఇల్లు అమ్మేసి డబ్బులిచ్చింది

తాజాగా బెంగళూరుకు చెందిన ఒక మహిళా టెకీకి ఎదురైన అనుభవం గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే.

By:  Garuda Media   |   17 Dec 2025 10:36 AM IST
డిజిటల్ అరెస్టు బెదిరింపులకు భయపడి ఇల్లు అమ్మేసి డబ్బులిచ్చింది
X

సైబర్ బందిపోట్ల దుర్మార్గాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మాటలతో భయపెట్టి కోట్లాది రూపాయిల్ని సైతం దండుకునే దుర్మార్గం ఇటీవల కాలంలో మరింత ఎక్కువ అవుతోంది. విషయాల మీద అవగాహన లేని కారణంగా.. వారు చెప్పే మాటలకు తీవ్ర ఆందోళనకు గురికావటం.. భయంతో చేతిలోని ఆస్తుల్ని సైతం కారుచౌకగా అమ్మేసి.. సైబర్ దొంగలకు డబ్బులు ఇచ్చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక మహిళా టెకీకి ఎదురైన అనుభవం గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే.

డిజిటల్ అరెస్టులకు భయపడిన సదరు మహిళ.. వారు అడిగిన డబ్బుల్ని ఇచ్చేందుకు కారుచౌకగా తన ఇంటిని సైతం అమ్మేసిన షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. అంతేకాదు.. బ్యాంకులో అప్పు తీసుకొని మరీ డబ్బులు కట్టేసింది. మొత్తంగా ముంబయి పోలీసుల పేరుతో వారం పాటు వారు పెట్టిన టార్చర్ తో ఇంటిని అమ్మేయటం.. బ్యాంకులో లోన్ తీసుకొని మొత్తంగా రూ.2.05 కోట్లు కొల్లగొట్టిన ఉదంతం షాకిచ్చేలా మారింది.

బాధితురాలు బెంగళూరులో కొడుకుతో కలిసి ఉంటోంది. ఐటీ సంస్థలో జాబ్ చేస్తోంది. నవంబరు 19న ఒక కొరియర్ కంపెనీ ప్రతినిధి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు లింకు అయిన కొరియర్ బాక్సులో డ్రగ్స్ బయటపడినట్లుగా భయపెట్టాడు. ముంబయి పోలీసులు వచ్చి అరెస్టు చేయనున్నట్లు హెచ్చరించాడు. దీంతో వణికిపోయిన ఆమె.. దాని నుంచి బయటపడే మార్గం ఎలా అన్న దానికి సైబర్ బందిపోట్ల ముఠా.. ఆమె నుంచి భారీగా డబ్బులు దోచేసింది.

వీరు అడిగిన డిమాండ్లను తీర్చేందుకు ఉన్న ఇంటిని కారుచౌకగా అమ్మేసింది. ఆ డబ్బుతో పాటు బ్యాంకులో అప్పు తీసుకొని మరీ నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయటం.. ఈ ఉదంతం గురించి తెలిసిన సన్నిహితులతో చెప్పగా.. ఆమెను సైబర్ నేరస్తులు ట్రాప్ చేశారన్న విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆమె తాను మోసపోయిన విషయాన్ని గుర్తించి.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిజిటల్ అరెస్టులకు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆ తరహా కాల్ ను రిసీవ్ చేసుకుంటే.. వారి మాటల్ని వినకుండా.. ఇంటికి వచ్చేయాలని.. అలా కాకుంటే తానే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళుతున్నానని.. వెంటనే అక్కడికి వచ్చి అరెస్టు చేయాలని గట్టిగా చెబితే తొలుత దబాయించినా.. ఆ తర్వాత వారి నుంచి వేధింపులకు బ్రేకులు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో.. ఈ తరహా నేరస్తుల విషయంలో పారాహుషార్.