Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి వచ్చి.. కన్నవారినే కడతేర్చి.. టెకీ కిరాతకం!

భారత్‌లో సొంతంగా స్ట్రాటప్ మొదలుపెట్టి వ్యాపారం ప్రారంభించాలని రోహన్ భావించాడు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు కావాలని తన తల్లిదండ్రులను కోరాడు.

By:  A.N.Kumar   |   12 Feb 2026 2:16 PM IST
అమెరికా నుంచి వచ్చి.. కన్నవారినే కడతేర్చి..  టెకీ కిరాతకం!
X

విదేశాల్లో చదువుకుని.. డాలర్ల వేటలో పడి కన్నవారికి దూరంగా ఉన్నా.. ఏదో ఒకరోజు కొడుకు తిరిగి వస్తాడని.. తమకు తోడుగా ఉంటాడని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ అదే కొడుకు తమ పాలిట కాలయముడు అవుతాడని వారు ఊహించలేకపోయారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆస్తి వివాదం ముదిరి కన్నతండ్రిని, తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఐటీ నగరం బెంగళూరులో కలకలం రేపింది.

- అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని అత్యంత విలాసవంతమైన ఆదర్శ్ విస్టా విల్లా ప్రాంతంలో రిటైర్డ్ నేవీ కెప్టెన్ నవీన్ చంద్ర భట్, ఆయన భార్య డాక్టర్ శ్యామల నివసిస్తున్నారు. వీరి కుమారుడు రోహన్ (33) కొంతకాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చాడు.

భారత్‌లో సొంతంగా స్ట్రాటప్ మొదలుపెట్టి వ్యాపారం ప్రారంభించాలని రోహన్ భావించాడు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు కావాలని తన తల్లిదండ్రులను కోరాడు. అయితే ఆర్థిక కారణాల రీత్యా వారు నిరాకరించడంతో గత కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

- ఆస్తి గొడవ.. రక్తపాతం!

ఘటన జరిగిన రోజు కూడా వ్యాపార పెట్టుబడి విషయంలో తండ్రికి, కొడుకుకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రోహన్, ఇంట్లోని కత్తితో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన తల్లిని కూడా వదలకుండా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

- నిందితుడు అరెస్ట్

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు రోహన్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారానికి డబ్బు ఇవ్వకపోవడం.. ఆస్తి పంపకాల విషయంలో ఉన్న మనస్పర్థలే ఈ దారుణానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడా లేదా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

- విదేశీ మోజు.. స్వదేశంలో విషాదం!

ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న అసహనానికి అద్దం పడుతోంది. ఉన్నత చదువులు చదివి, విదేశీ సంస్కృతిని చూసి వచ్చిన యువత.. కన్నవారి పట్ల కనీస కనికరం లేకుండా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా హింస ద్వారా పరిష్కారం దొరకదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాలే నాశనమవుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది.