Begin typing your search above and press return to search.

లవ్ చేయలేదని దారుణంగా కొట్టి..పురుగుల మందు తాగించి చంపాడు

ఇదిలా ఉంటే.. తన ప్రేమను నో చెప్పటాన్ని సహించలేని కమలాకర్.. ఆమె ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు

By:  Tupaki Desk   |   20 Sept 2023 4:08 AM
లవ్ చేయలేదని దారుణంగా కొట్టి..పురుగుల మందు తాగించి చంపాడు
X

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని వెంటబడిన ఒకడు.. తాను ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించటం లేదన్న కోపంతో అమానవీయంగా వ్యవహరించి హత్య చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పందొమ్మిదేళ్ల దీప ఇంటర్ తర్వాత చదువు మానేసి కూలీ పనులకు వెళుతోంది. ఆమెపై అదే గ్రామానికి చెందిన కమలాకర్ ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ప్రైవేటు డ్రైవర్ గా పని చేసే ఇతడు.. ఆమెను ప్రేమిస్తున్నాడంటూ వేధిస్తున్నాడు. ఇప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్న కమలాకర్ ప్రేమకు దీప నో చెప్పింది.

ఇదిలా ఉంటే.. తన ప్రేమను నో చెప్పటాన్ని సహించలేని కమలాకర్.. ఆమె ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాదు.. ఆమె కుటుంబ సభ్యుల్ని చంపేస్తానంటూ మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇంట్లోని వారు బయటకు వెళ్లిన సమయాన్ని చూసుకున్న కమలాకర్.. ఆమె ఇంట్లోకి జొరపడ్డాడు.

తనను ప్రేమించకుండా వేరే వాళ్లతో మాట్లాడతావా? అంటూ ఆమెను దారుణంగా కొట్టాడు. అక్కడే ఉన్న పురుగు మందును ఆమె నోట్లో పోసి.. బలవంతంగా తాగించి పారిపోయాడు. తనను కాపాడాలంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున అరుస్తున్న ఆమెను.. సిర్పూరు (టి) ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తుండగా దీప ప్రాణాలు వదిలింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.