Begin typing your search above and press return to search.

వెళ్లిపోయిన భార్య కోసం కొడుకుతో కలిసి వెతుకుతుంటే చంపేశారు

విన్నంతనే నిలువెత్తు విషాదం కమ్మేసే ఈ ఉదంతమిది. అయ్యో.. ఎంత పని జరిగిందని అనుకోకుండా ఉండలేని విషాద ఘటనగా చెప్పాలి.

By:  Garuda Media   |   7 April 2026 10:57 AM IST
వెళ్లిపోయిన భార్య కోసం కొడుకుతో కలిసి వెతుకుతుంటే చంపేశారు
X

విన్నంతనే నిలువెత్తు విషాదం కమ్మేసే ఈ ఉదంతమిది. అయ్యో.. ఎంత పని జరిగిందని అనుకోకుండా ఉండలేని విషాద ఘటనగా చెప్పాలి. తన సుఖమే తప్పించి.. కొడుకు.. కుటుంబం గురించి అస్సలు ఆలోచించని ఆమె ఒకవైపు.. ఆమె కోసం ఆరాటపడుతూ ఐదేళ్ల కొడుకును తీసుకొని ఊళ్లల్లో వెతుకుతున్న వేళ.. హత్యకు గురైన ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంలో వెళ్లిపోయిన భార్య.. ఐదేళ్ల కొడుకు కోసం ఏదోలా ఒప్పించి వెనక్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో.. బిడ్డను వెంట పెట్టుకొని వెళ్లిన ఆ తండ్రి దారుణహత్యకు గురైన ఉదంతంలోకి వెళితే..

ఉదయాన్నే ఆ ఊరి అడవి వెలుపుల కూర్చొని గుక్క పట్టి ఏడుస్తున్న ఐదేళ్ల చిన్నారిని చూసిన గ్రామస్తులు.. ఏం బాబు? ఏమైంది? మీది ఏ ఊరు? అని అడిగారు బి.యానాదిపాళ్యం గ్రామస్తులు. తన తండ్రిని అడవిలో చంపేసినట్లుగా చెప్పిన ఆ పిల్లాడి మాటలకు విస్మయానికి గురైన ఆ ఊళ్లోని కొందరు ఆ పిల్లాడ్ని తీసుకొని.. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. ఒక వ్యక్తి దారుణహత్యకు గురైన ఉదంతం చూసి షాక్ తిన్నారు.

ఆ గ్రామానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్త ఒకరు బాలుడ్ని సముదాయించి.. ప్రాథమిక వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ పిల్లాడు ఇచ్చిన సమాచారంతో పాటు.. పలువురి నుంచి రాబట్టిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని గుడియాత్తానికి చెందిన 45 ఏళ్ల గాంధీ.. రాసాతి దంపతులు. వారికి ఐదేళ్ల కొడుకు సందీప్ ఉన్నారు. వారి కుటుంబం సాఫీగా సాగుతున్న వేళలో.. కొన్ని నెలల క్రితం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ యానదిపాళ్యానికి చెందిన నరసింహులు.. ఆ కుటుంబానికి పరిచయమయ్యాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే రాసాతితో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఆమె భర్త గాంధీ, కొడుకు సందీప్ లను వదిలేసి నరసింహులతో కలిసి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రసాతిని వెతుకుతూ గాంధీ.. అతడి ఐదేళ్ల కొడుకు సందీప్ లు కలిసి నరసింహులు ఉండే మండలానికి చేరుకున్నారు. అక్కడే వారికి రసాతి ఉన ఊరు తెలియటంతో వారు ఆదివారం అక్కడికి వెళ్లారు. తన భార్యను తనతో పంపాలని గాంధీ కోరగా.. నరసింహులు , మరికొందరు గుర్తు తెలియని వారు త్వరలోనే పంపుతామని నమ్మబలికారు.

మద్యం తాగి ఉన్న దుండగులు గాంధీని అతడి కొడుకు సందీప్ ను పక్షిరాజుపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.రాత్రి వేళ గాంధీని రాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. వారి దాడి నుంచి తప్పించుకున్న బాలుడు.. తన తండ్రిని కళ్ల ముందే చంపుతున్నదంతా చూశాడు. భయంతోనే రాత్రంతా అడవిలో ఉండిపోయిన ఆ చిన్నారి.. సోమవారం ఉదయం అడవికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బి.యానాదిపాళ్యం గ్రామానికి వచ్చాడు. తన తండ్రిని చంపినట్లుగా చెప్పాడు. దీంతో.. గ్రామస్తులు కొందరు కలిసి వెళ్లగా.. దారుణ హత్యకు గురైన గాంధీ డెడ్ బాడీని చూశారు. ఇదంతా చూసిన వారంతా.. జరిగిన దారుణానికి వేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గాంధీ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. తల్లి చేసిన తప్పునకు ఐదేళ్ల బాలుడు ఎంతటి వేదన చెందాల్సిన పరిస్థితో కదా?