Begin typing your search above and press return to search.

భర్త మృతదేహం డోర్ డెలివరీ!... ఈసారి ఏపీలోనే ఘోరం!

ఈ సమయంలో రెండు నెలల క్రితం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా... రమణ పిడుగురాళ్లలోని పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది.

By:  Tupaki Desk   |   23 July 2025 6:56 PM IST
భర్త మృతదేహం డోర్  డెలివరీ!... ఈసారి ఏపీలోనే ఘోరం!
X

గత కొంతకాలంగా భార్యల చేతుల్లో మృత్యువాత పడుతున్న భర్తల ఘటనలు ఎన్నో తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. చంపేసి డ్రమ్ములో సిమెంట్ వేసిన ఘటన ఒకటైతే... భర్తను చంపి, ప్రియుడితో పాటు బైకి బాడీని తీసుకెళ్లిన ఘటన మరొకటి! ఇటీవల భర్తను చంపి, ఇంట్లోనే పాతి పెట్టి, పైన టైల్స్ పెట్టి, ప్రియుడితో పారిపోయిన ఘటన ఇంకొకటి. ఈ క్రమంలో భర్త మృతదేహం డోర్ డెలివరీ చేసిన భార్య ఘటన తెరపైకి వచ్చింది!!

అవును... గత కొంతకాలంగా భార్యల చేతుల్లో హత్య కాబడుతోన్న భర్తల సంఖ్య పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వారిని ఇంట్లో తండ్రి సపోర్ట్ చేసిన ఘటనలు కొన్నైతే.. మెజారిటీ ఘటనల్లో ప్రియుడే సహకారిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా సోదరుడి సాయంతో భర్తను చంపి, అతని ఇంటికి తీసుకొచ్చి పడేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో జరిగింది. దీనిపై పోలీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి!

నంద్యాల పట్టణానికి చెందిన మేకల శేషాచలం (48) అనే వ్యక్తి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన రమణ అనే మహిళతో చాలాకాలం క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శేషాచలం నంద్యాల పట్టణంలోనే పెయింటర్‌ గా పని చేసేవాడు. అయితే... చాలామంది భార్యభర్తల లాగానే వీరిమధ్య మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవంట!

ఈ సమయంలో రెండు నెలల క్రితం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా... రమణ పిడుగురాళ్లలోని పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో... సోమవారం తన భర్తకు ఫోన్‌ చేసిన రమణ... 'మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, ఒక సారి పిడుగురాళ్లకు రా' అని కోరింది! దీంతో అతను నంద్యాల నుంచి పిడుగురాళ్లకు వచ్చాడు. అయితే... మంగళవారం ఉదయం చూసేసరికి శేషాచలం మృతి చెందాడు.

దీంతో... అతడి మృతదేహాన్ని కారులో తీసుకొని రమణ, ఆమె సోదరుడు రామయ్య కలిసి నంద్యాలకు వెళ్లారు. అనంతరం.. మృతదేహాన్ని ఇంటి వద్ద పడేశారు! అయితే... అక్కడున్న చిన్న కుమార్తెకు తండ్రి మృతిపై అనుమానం రావడంతో.. నంద్యాల పోలీసుస్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు శేషాచలం ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.

అనంతరం.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలో... సోమవారం రాత్రి అత్తగారి కుటుంబ సభ్యులకు, శేషాచలానికి మధ్య ఘర్షణ జరిగిందని.. ఈ క్రమంలో అతని భార్య, ఆమె తమ్ముడు కలిసి అతడి కళ్లల్లో కారం చల్లి దాడి చేశారని.. ఆ దాడిలో శేషాచలం చనిపోయాడని అంటున్నారు!! దీంతో... ఈ విషయం స్థానికంగా సంచలనం రేపుతోంది!