ఫేస్ బుక్ లో పరిచయం.. పెళ్లికి నో చెప్పిందని కత్తిపోట్లు!
సామాజిక మాధ్యమంలో పరిచయమైన అమ్మాయితో పెళ్లి అంటూ వెంటపడిన నంద్యాలకు చెందిన ఒక కుర్రాడు..ఆమె అందుకు నో చెప్పటంతో కత్తిపోట్లకు గురి చేసిన ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 23 April 2025 1:00 PM ISTసామాజిక మాధ్యమంలో పరిచయమైన అమ్మాయితో పెళ్లి అంటూ వెంటపడిన నంద్యాలకు చెందిన ఒక కుర్రాడు..ఆమె అందుకు నో చెప్పటంతో కత్తిపోట్లకు గురి చేసిన ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది. పట్టపగలు.. దారి కాచి నడిరోడ్డు మీద దాడికి పాల్పడిన వైనం సంచనలంగా మారింది. నంద్యాలకు చెందిన 27 ఏళ్ల విజయభాస్కర్ కు ఫేస్ బుక్ లో కర్ణాటకలోని హోసపేటకు చెందిన భారతితో పరిచయమైంది.
ఆమె పట్టణంలోని ఒక మొబైల్ ఫోన్ కేర్ సెంటర్ లో పని చేస్తోంది. అయితే.. వీరి రెండు కుటుంబాల మధ్య దూరపు చుట్టరికం ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇదిలా ఉండగా.. కొంతకాలం గడిచిన తర్వాత నుంచి భారతిని తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డారు. అందుకు భారతి నో చెప్పింది. ఈ నేపథ్యంలో హోసపేటలోని ఆమె ఇంటికి వెళ్లిన విజయభాస్కర్.. ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు.
అయితే.. వారు కూడా విజయభాస్కర్ ప్రపోజల్ ను ఒప్పుకోలేదు. దీంతో కోపానికి గురైన అతడు మంగళవారం హోసపేటకు వచ్చాడు. ఇంటి నుంచి జాబ్ కోసం స్కూటీ మీద వెళుతున్న భారతిని అడ్డుకున్నాడు. తనతో పెళ్లి చేసుకోవాలని మళ్లీ ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. దీంతో ఆమె చీదరించుకోవటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపులో పొడిచి.. ఎడమ చేతి మీద పోట్లు పొడిచాడు. ఊహించని పరిణామానికి బాధితురాలు తీవ్ర షాక్ కు గురైంది.
నడిరోడ్డు మీద జరిగిన ఈ ఉదంతంలో విజయభాస్కర్..దాడి అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక చికిత్సను అందించిన అనంతరం భారతిని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు దాడికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
