సుదీర్ఘకాలంగా కంటున్న కల ఇప్పటికి నెరవేరింది. డాలర్ అధిక్యతను.. అధిపత్యాన్నిసవాలు విసరటం సాధ్యం కాకున్నా.. పరిమిత మోతాదులో చెక్ పెట్టే దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించటమే కాదు.. తొలిసారి యూఏఈ ఆయిల్ బిల్లును యూఎస్ డాలర్లలో కాకుండా రూపాయిల్లో చెల్లించిన వైనం తాజాగా చోటు చేసుకుంది. సాధారణంగా యూఏఈ నుంచి కొనే క్రూడాయిల్ చెల్లంపులు అన్నీ కూడా డిఫాల్ట్ కరెన్సీగా యూఎస్ డాలర్ గా ఉంది. దశాబ్దాలుగా దీన్నే ఫాలో అవుతున్నారు.
ప్రపంచంలోనే అతి ఎక్కువగా క్రూడ్ ను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే.. చెల్లింపులు అన్నీ కూడా డాలర్ రూపంలో ఇవ్వటం వల్ల.. అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలకు అనుగుణంగా డాలర్ల కొనుగోలు భారంగా మారుతోంది. నిజానికి ఇంత భారీగా డాలర్లను కొనుగోలు చేయటం రూపాయిని బలహీనంగా చేయటానికి.. డాలర్ ను మరింత బలోపేతం చేయటానికి కారణంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి కొనుగోలు చేసే క్రూడాయిల్ బిల్లును మన రూపాయి మారకంలో చెల్లింపులు జరిపేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు రాని పరిస్థితి. మొత్తంగా గత జులైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూఏఈకి జరిపే చెల్లింపులు రూపాయి మారకంలో చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆగస్టులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ నుంచి కొన్న 10 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం రూపాయి చెల్లింపులు చేయటం చారిత్రక ఘటనగా చెప్పాలి. ఎందుకుంటే.. యూఎస్ డాలర్ల కొనుగోళ్ల ఒత్తిడి నుంచి కాస్తంత రిలీఫ్ కలిగే పరిస్థితి తాజా పరిణామంతో చోటు చేసుకోనుంది.
ఆ మధ్యన రష్యా నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్ చెల్లింపుల్లోనూ కొంత మొత్తాన్ని రూపాయిల్లో చెల్లింపులు చేయటం తెలిసిందే. ఇలా చెల్లింపుల ప్రక్రియ పెరిగే కొద్దీ.. డీఫాల్ట్ మారకంగా ఉన్న డాలర్ చెల్లింపుల నుంచి బయటకు వచ్చే వీలుంది. అయితే.. మొత్తం చెల్లింపులన్నీ ఇదే తీరుతో కాకున్నా.. ఒక క్రమపద్దతిలో రూపాయి మారకంలో చేసేలా నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ చెల్లింపుల జోరు మరింత పెరిగి.. మన నుంచి ఎగుమతులు ఎక్కువగా సాగటం ద్వారా.. మన రూపాయిని బలోపేతం చేసుకునే వీలుంది.