Begin typing your search above and press return to search.

వజ్రాల రాజధానికి మరో కొత్త గుర్తింపు.. కారణం ఎవరంటే?

ఈ సంస్థ సూరత్ కు వచ్చే వజ్రాల వ్యాపారులు మరింత సులువుగా బిజినెస్ చేసుకోవటానికి వీలుగా ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2023 6:26 AM GMT
వజ్రాల రాజధానికి మరో కొత్త గుర్తింపు.. కారణం ఎవరంటే?
X

వజ్రాల నగరిగా పేరు గుజరాత్ లోని సూరత్ నగరానికి ఉందన్న సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్దదైన వజ్రాల మార్కెట్ గా పేరున్న సూరత్ కు సంబంధించిన వార్తలు అప్పుడప్పడు రావటం తెలిసిందే.

సూరత్ ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు సూరత్ లోనే తయారు చేస్తుంటారు. నిత్యం దేశ విదేశాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు.

సూరత్ కు చెందిన పలువురు వజ్రాల వ్యాపారులు తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు.. వసతులు.. దీపావళి సందర్భంగా ఇచ్చే నజరానాలు వార్తలుగా వస్తూ ఉండటం తెలిసిందే.

తాజాగా మరో విషయంలోనూ సూరత్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగనుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆఫీస్ అన్నంతనే అమెరికాలోని పెంటగాన్ అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ.. మరికొద్ది నెలల్లో ఆ మాట చెప్పటానికి వీల్లేదు. కారణం.. సూరత్ లో ప్రపంచంలోనే అతి పెద్దదైన కార్యాలయాన్ని నిర్మిస్తుండటమే.

సూరత్ డైమండ్ బోర్స్ సంస్థ.. తమ కార్యాలయాన్ని వజ్రాల నగరిలో నిర్మిస్తోంది. ఈ సంస్థ సూరత్ కు వచ్చే వజ్రాల వ్యాపారులు మరింత సులువుగా బిజినెస్ చేసుకోవటానికి వీలుగా ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి కానుంది.

మోర్ఫోజెనిసిస్ అనే భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ ఈ భారీ భవనాన్ని డిజైన్ చేసింది.35 ఎకరాల్లో 15 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భారీ భవనంలో 65వేల మంది వ్యాపారం చేసుకోవటానికి వీలుగా దీన్ని నిర్మించారు.

ఈ భారీ నిర్మాణానికి ముందే పలు వజ్రాల సంస్థలు ఇందులో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కొనుగోలు చేయటం గమనార్హం. ఈ భారీ భవనాన్ని నవంబరులో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.