Begin typing your search above and press return to search.

శ్రీరాం చిట్స్ "త్యాగ"రాజన్... ఈయన గురించి తెలుసుకోవాల్సిందే!

కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని దాదాపు రూ. 6210 కోట్ల (750 మిలియన్ల డాలర్ల) మొత్తం సంపదను తన ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 3:09 AM GMT
శ్రీరాం చిట్స్  త్యాగరాజన్... ఈయన గురించి తెలుసుకోవాల్సిందే!
X

ఈ ప్రపంచంలో ఎంతో మంది పుడుతుంటారు.. అనంతరం కాలం చేస్తారు. ఈ గ్యాప్ లో కోట్లకు కోట్లు సంపాదించేవారూ ఉంటారు.. కటిక దరిద్రం అనుభవించనవారూ ఉంటారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే చరిత్రలో కొన్ని పేజీలను తన పేరున రాసుకుంటారు. వీరిలో 85 ఏళ్ల శ్రీరాం గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్ ఒకరు.

తమిళనాడులోని సంపన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టారు శ్రీరాం గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్. తన 37 సంవత్సరాల వయస్సులో 1974లో చెన్నైలో బంధువులు, స్నేహితులతో శ్రీరాం చిట్స్‌ ను స్థాపించడం ద్వారా తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే దీనికోసం ముందు ఉద్యోగం చేశారు.

అవును... శ్రీరాం చిట్స్ సంస్థను స్థాపించేముందు 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరి, వివిధ ఫైనాన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పని చేస్తూ అనుభవాన్ని గడించారు త్యాగరాజన్. ఈ అనుభవంతోనే సాంప్రదాయ బ్యాంకులు పట్టించుకోని తక్కువ ఆదాయ రుణగ్రహీతలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించారు.

ఈ క్రమంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడంలోని అతని నమ్మకం కంపెనీ వృద్ధికి దారితీసింది. ఫలితంగా శ్రీరాం చిట్స్ రూ. 6210 కోట్లు కంటే ఎక్కువ విలువైన సంస్థగా అవతరించింది. ఇదే సమయంలో 23 మిలియన్లకు పైగా వినియోగదారులతో 30 కంపెనీలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఈ క్రమంలో ఈ సంవత్సరం జూలైలో శ్రీరాం గ్రూపు షేర్లు 35శాతం పెరిగి రికార్డ్‌ నమోదు చేశాయి. ఇది భారతదేశపు బెంచ్‌ మార్క్ స్టాక్ ఇండెక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఇలా ఆర్థికంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని వ్యాపార దిగ్గజంగా ఎదగడం మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత, మానవత్వం పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉన్న మహా మనీషి త్యాగరాజన్!

ఈ సమయంలో వ్యాపారంలో ఘన విజయం సాధించిన త్యాగరాజన్.. స్వయంగా కమ్యూనిస్టు భావాలను రంగరించుకున్నారు. ఆయన తన విజయంలో కంపెనీ ఉద్యోగులపాత్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఈ క్రమంలో వారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందులో భాగంగా... కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని దాదాపు రూ. 6210 కోట్ల (750 మిలియన్ల డాలర్ల) మొత్తం సంపదను తన ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సామ్రాజ్యం విజయానికి, కోట్ల సంపదకు ఆర్జనకు సహకరించిన వారి పట్ల నిబద్ధతను చాటుకున్నారు.

కాగా.. త్యాగరాజన్ 1937 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్‌, మాథ్య్స్‌ లో మాస్టర్స్ చేశారు. తరువాత కోల్‌ కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ లో మూడు సంవత్సరాలు చదివారు. 1961లో దేశీయ అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలోనూ, వైశ్యా బ్యాంక్, రీ ఇన్స్యూరెన్స్ బ్రోకర్ సంస్థ జేబీ బోడా అండ్‌ కోలోనూ పనిచేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీరాం కంపెనీలలో తన వాటాలన్నింటినీ ఉద్యోగుల గ్రూపునకు కేటాయించి.. 2006లో ఏర్పాటు చేసిన శ్రీరాం ఓనర్‌ షిప్ ట్రస్ట్‌ కు బదిలీ చేసిన గొప్ప వ్యక్తి త్యాగరాజన్‌. ఈ శాశ్వత ట్రస్ట్‌ లో 44 గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌ లు ఉన్నారు. ట్రస్ట్ హోల్డింగ్ మొత్తం విలువ 750 మిలియన్ల డాలర్లకు పైమాటే.