Begin typing your search above and press return to search.

రిలయన్స్ మజాకానా? టాప్ 500 కంపెనీల్లో రారాజు!

దేశంలోనే అత్యంత విలువైన టాప్ 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రభాగాన నిలిచింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 6:30 AM GMT
రిలయన్స్ మజాకానా? టాప్ 500 కంపెనీల్లో రారాజు!
X

తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న రిలయన్స్ సంస్థ మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలువైన టాప్ 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రభాగాన నిలిచింది. 2023 అక్టోబరు నాటికి ఆయా సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేశారు. యాక్సిస్ బ్యాంక్ కు వెల్త్ మేనేజ్ మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్.. హురున్ ఇండియా సంయుక్తంగా రూపొంచిందిన ఈ నివేదికలో పలు అంశాలున్నాయి. ఇందులో రిలయన్స్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది.

ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ నివేదికను సిద్ధం చేసిన సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు. అయితే.. ప్రస్తుతం ఆ సంస్థ మార్కెట్ విలువ రూ.19.65 లక్షల కోట్లు కావటం గమనార్హం. రెండో స్థానంలో టీసీఎస్ నిలిచింది. రిపోర్టు సిద్ధం చేసే నాటికి సంస్థ మార్కెట్ విలువ రూ.12.64 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.14.90లక్షల కోట్లు. మూడో స్థానంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లు. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10.55లక్షల కోట్లు కావటం గమనార్హం. గడిచిన కొద్ది రోజులుగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేరు ధర కిందకు చూడటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

ప్రైవేటు రంగంలోకి టాప్ 500 కంపెనీల మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తం సౌదీ.. స్విట్జర్లాండ్.. సింగపూర్ ల సంయుక్త జీడీపీ కంటే ఎక్కువ. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13 శాతం వ్రద్ధి రేటులో రూ.79 లక్షల కోట్ల అమ్మకాల్ని నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువగా చెప్పాలి. ఈ సంస్థలు దేశంలో 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించాయి. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో 1.3శాతం వీటి వాటా. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా.. ఇందులో టాప్ మేనేజ్ మెంట్ స్థాయిలో 437 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 179 మంది సీఈవో స్థాయిలో పని చేస్తున్నారు.

టాప్ 500 కంపెనీల్లో 52 కంపెనీలు పదేళ్ల కంటే తక్కువ చరిత్ర ఉన్నవి కాగా.. అత్యంత సుదీర్ఘకాలంగా ఉన్న ఈఐడీ ప్యారీ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కంపెనీకి 235 ఏళ్ల చరిత్ర ఉండటం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28 ర్యాంకులో నిలిచింది. హెచ్ సీఎల్ టెక్నాలజీస్.. కోటక్ మహీంద్రా బ్యాంకులు టాప్ 10 జాబితాలోకి వచ్చాయి.

జాబితాలో సగానికి పైగా కంపెనీలు గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్లకు పైగా మార్కెట్ విలువను పెంచుకోగా.. 75 కంపెనీలు రూ.10వేల కోట్లకు పైగా పెంచుకున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలోని 44 నగరాల్లో ఈ 500 కంపెనీలు ఉండగా.. ముంబయిలో అత్యధికంగా 156 సంస్థలు ఉన్నాయి. బెంగళూరులో 59, ఢిల్లీలో 39, హైదరాబాద్ లో 29 కంపెనీలు ఉన్నాయి. ఈ 500 కంపెనీల్లో ఆర్థిక సేవల రంగంలో 76, ఆరోగ్య సంరక్షణ రంగంలో 58, వినియోగదారుల వస్తువుల కంపెనీలు 38 ఉన్నాయి.

జాబితాలోని టాప్ 500 కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 29 సంస్థలు చోటు సాధించాయి. వీటి మార్కెట్ విలువ రూ.5.93 లక్షల కోట్లు. ఏడాది క్రితంతో పోలిస్తే వీటి విలువ 22శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొలి 10 కంపెనీలు చూస్తే..

కంపెనీ మార్కెట్ విలువ(రూ.కోట్లలో)

దివీస్ ల్యాబ్స్ 90,350

డాక్టర్ రెడ్డీస్ 89,152

మేఘా ఇంజినీరింగ్ 67,500

అరబిందో 50,470

హెటెరో 24,100

లారస్ ల్యాబ్స్ 19,464

సైయెంట్ 17,600

ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 17,500

డెక్కన్ కెమికల్స్ 15,400

కిమ్స్ 15,190