Begin typing your search above and press return to search.

ముకేష్ అంబానీ పిల్లల విషయంలో "రిల్" కీలక నిర్ణయం!

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులైన ఆకాశ్, ఇషా, అనంత్ లు ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:34 AM GMT
ముకేష్ అంబానీ పిల్లల విషయంలో రిల్ కీలక నిర్ణయం!
X

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులైన ఆకాశ్, ఇషా, అనంత్ లు ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వాళ్లు ముగ్గురూ "రిల్" కంపెనీలో బోర్డు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. అయితే తాజాగా వీరి వేతనాల విషయంలో రిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... వారికి సున్నా వేతనాలను ఫిక్స్ చేసింది.

అవును... ముకేశ్ అంబానీ వారసులకు వేతనాలు లేవని.. చెల్లించేది లేదని రిల్ తీర్మానించింది. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రమే ముగ్గురికి ఫీజు, ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్‌ ను మాత్రమే చెల్లిస్తారు. ఈ మేరకు షేర్ హోల్డర్లకు పంపిన తీర్మానంలో ఈ విషయాన్ని పొందుపర్చినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. షేర్ హోల్డర్స్ కు ఈ తీర్మానాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా రిలయన్స్‌ పంపించింది.

అయితే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ముకేశ్‌ అంబానీ సమీప బంధువులు నికిల్‌, హితల్‌ మాత్రం జీతంతో పాటు భత్యాలు, కమీషన్లు సహా ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. కాగా... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆయన పిల్లలు కూడా వేతనం లేకుండా పనిచేయనున్నారు!

వాస్తవంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతా అంబానీ బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్‌ రుసుం కింద రూ.6 లక్షలు, కమీషన్‌ రూపంలో రూ.2 కోట్లు పొందినట్లు రిలయన్స్‌ యాన్యువల్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు అలాంటి షరతులే ఆకాశ్‌, అనంత్‌, ఈశాలకూ వర్తించనున్నాయి.

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో ముకేష్ ముగ్గురు పిల్లలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా... రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ ఛైర్మన్‌ గా ఆకాశ్ అంబానీ ఉండగా.. రిలయన్స్ రిటైల్ బాధ్యతల్లో ఇషా అంబానీ ఉన్నారు. ఇదే సమయంలో అనంత్ అంబానీ... న్యూ ఎనర్జీ సెక్టార్ ‌మెయింటెనెన్స్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

కాగా... 1977లో మొత్తమొదటి సారిగా ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ లో బోర్డు డైరెక్టరుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం... 2002లో తండ్రి ధీరూభాయ్‌ అంబానీ మరణం తర్వాత ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో... 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు వార్షిక పారితోషికాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు ముకేశ్‌.

అనంతరం 2020-21లో కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా తిరిగి పూర్తి సామర్థ్యంలో ఆదాయాలు ఆర్జించేంతవరకు వేతనం తీసుకోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2020-21 నుంచి వరుసగా మూడేళ్లుగా ఆయన ఎలాంటి జీతాన్ని కానీ, లాభాలపై కమిషన్‌ ను కానీ పొందడం లేదు.