Begin typing your search above and press return to search.

తండ్రికి తగ్గట్లే భారీ డీల్ క్లోజ్ చేసిన ముకేశ్ అంబానీ కుమార్తె

దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్టైల్ భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:26 AM GMT
తండ్రికి తగ్గట్లే భారీ డీల్ క్లోజ్ చేసిన ముకేశ్ అంబానీ కుమార్తె
X

దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్టైల్ భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మిగిలిన పారిశ్రామికవేత్తలకు సాధ్యం కాని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. రిలయన్స్ ను నడిపే విషయంలో ఆయన దూకుడు మరోరేంజ్ లో ఉండటం తెలిసిందే. ముకేశ్ అంబానీకి ఏ మాత్రం తీసిపోనన్న విషయాన్ని తాజా డీల్ లో నిరూపించారు ఆయన కుమార్తె ఇషా అంబానీ.

కొవిడ్ వేళ ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న వేళలో.. రిలయన్స్ మాత్రం అందుకు భిన్నంగా పలు అంతర్జాతీయ డీల్స్ ను పూర్తి చేయటం ద్వారా ఔరా అనేలా చేసింది. సుమారు రూ.47వేల కోట్లకు పైగా నిధుల్ని సమీకరించింది. కట్ చేస్తే.. గడిచిన మూడేళ్ల కాలంలో మళ్లీ అలాంటి డీల్ చేసింది లేదు. తాజాగా ఆయన కుమార్తె ఇషా భారీ డీల్ ను సెట్ చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్.. ఖతార్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీనుంచి భారీ పెట్టుబడిని సొంతం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా 0.99 శాతం వాటా (ఒక శాతం కంటే తక్కువ)ను ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో.. రిలయన్స్ రిటైల్ లోకి రూ.8278 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా స్టాక్ ఎక్సైంజీకి అందించింది. ఈ మైనార్టీ వాటా రిలయన్స్ కు మరింత బలాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు.

తాజాగా డీల్ లో రిలయన్స్ రిటైల్ ను ప్రపంచ స్థాయి సంస్థగా డెవలప్ చేసేందుకు కుదురుతుందని ఇషా అంబానీ పేర్కొన్నారు. మరోవైపు తాజాగా పెట్టుబడులకు ఓకే చెప్పిన ఖతార్ ఇన్వెస్టుమెంట్ అథారిటీ సీఈవో మన్సూర్ ఇబ్రహీం అల్ మహ్మద్ మాట్లాడుతూ.. వేగంగా డెవలప్ అవుతున్న భారత రిటైల్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టటం సంతోషాన్ని ఇస్తుందన్నారు. రిలయన్స్ రిటైల్ కు 267 మిలియన్ల కస్టమర్ల బేస్ ఉంది. దేశ వ్యాప్తంగా 18500 స్టోర్లు ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇటీవల త్రైమాసికంలో ఎక్కువ లాభాల్ని నమోదు చేసింది కూడా రిలయన్స్ రిటైల్ కావటం గమనార్హం. తాజా పెట్టుబడి రిలయన్స్ ను మరింత దూసుకెళ్లలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా డీల్ తో ఇషా అంబానీ సామర్థ్యం అందరికి అర్థమయ్యేలా మారిందంటున్నారు.