Begin typing your search above and press return to search.

ఆ కంపెనీ లెక్కే వేరు.. లాభం రూ.215 కోట్లు.. విరాళాలు రూ.1365 కోట్లు

ఇదెలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్న. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి 2019 నుంచి 2023 వరకు వచ్చిన లాభం రూ.215 కోట్లు

By:  Tupaki Desk   |   17 March 2024 5:31 AM GMT
ఆ కంపెనీ లెక్కే వేరు.. లాభం రూ.215 కోట్లు.. విరాళాలు రూ.1365 కోట్లు
X

వ్యాపారం ఏదైనా కావొచ్చు.. దేని కోసం చేస్తారు? వ్యాపారం చేసేది లాభాల కోసం. మరి.. దానికి భిన్నంగా వ్యవహరిస్తే దాన్నేమనాలి? వచ్చిన లాభం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా విరాళాలు.. అది కూడా రాజకీయ విరాళాల్ని ఇవ్వటం దేనికి నిదర్శనం? ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాల్ని బయటకు వెల్లడించాలని.. ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావటం తెలిసిందే.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన వివరాల్ని చూసి ముక్కున వేలేసుకున్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం ''ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్''.. ''క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్'' అనే రెండు కంపెనీల వ్యవహారం మాత్రం షాకిచ్చేలా ఉంది. ఎందుకంటే.. ఈ రెండు కంపెనీలు కనీస వ్యాపార సూత్రాలకు భిన్నంగా వ్యవహరించటమే దీనికి కారణం.

ఈ రెండు కంపెనీలు తమకు వచ్చిన లాభాల కంటే వందల రెట్లు అధికంగా రాజకీయ విరాళాలు ఇచ్చినట్లుగా వెల్లడైంది. ఇదెలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్న. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి 2019 నుంచి 2023 వరకు వచ్చిన లాభం రూ.215 కోట్లు అయితే.. తమకు వచ్చిన లాభానికి 635 శాతం ఎక్కువగా రూ.1365 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొని పార్టీలకు విరాళాలుగా ఇచ్చిన వైనం బయటకు వచ్చింది. ఇదిప్పుడు సంచలనంగా మారింది.

అదే సమయంలో క్విక్ సప్లై చైన్ కంపెనీ కూడా నాలుగేళ్లలో రూ.110 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. అందుకు 374 శాతం అధికంగా అంటే రూ.410 కోట్ల మొత్తాన్ని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీలకు విరాళాలుగా ఇవ్వటం విశేషం. ఈ రెండింటి స్థాయిలో కాకున్నా.. ఇదే తరహాలో మరికొన్ని కంపెనీలు వ్యవహరించాయి.

ఇక.. . ఐఎఫ్ బీ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మరో కంపెనీ గత నాలుగేళ్లలో రూ.175 కోట్లు లాభాన్ని సాధించగా.. రూ.92 కోట్ల(అంటే లాభంలో 55శాతం విరాళాల రూపంలో అన్న మాట) ను ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు అందించింది. మరో మూడు కంపెనీలు సైతం తమ మొత్తం లాభాల్లో 37 శాతం.. 24 శాతం.. 15 శాతం చొప్పున ఎన్నికల బాండ్ల కోసం ఖర్చు చేశాయి. మరో 12 వరకు కంపెనీలు తమ లాభాల్లో 10 శాతం లోపు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి.. రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందజేసిన వైనం బయటకు వచ్చింది. ఇంతకూ వ్యాపారాలు చేసేది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.