Begin typing your search above and press return to search.

ఆదివారం.. అయినా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.. చరిత్రలో రెండోసారి!

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. స్వతంత్ర్య భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలా ఆదివారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరగటం ఇది రెండోసారిగా చెబుతున్నారు.

By:  Garuda Media   |   1 Feb 2026 12:22 PM IST
ఆదివారం.. అయినా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.. చరిత్రలో రెండోసారి!
X

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ రోజు (ఫిబ్రవరి 1, ఆదివారం) కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ ఈ రోజు పని చేయనుంది. ప్రభుత్వ సెలవు దినాలతో పాటు శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్ పని చేయదు కానీ.. బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఈ రోజున (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరగనుంది.

మరింత వివరంగా చెప్పాలంటే ఉదయం 9 గంటల నుంచి 9.08 గంటల వరకు ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది. సాధారణ ట్రేడింగ్ ఉదయం 9.15 గంటలకు మొదలై మధ్యాహ్నం 3.30 గంటలవరకు జరగనుంది. కమోడిటీ మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. ఆదివారం కావటంతో బ్యాంకులు పని చేయని నేపథ్యంలో సెటిల్ మెంట్ లు తర్వాతి పని దినం రోజున జరగనున్నాయి. ఇంతకూ ఇలాంటి పరిస్థితి (ఆదివారం ట్రేడింగ్ నిర్వహించటం) ఇదే మొదటిసారా? లేదంటే గతంలోనూ ఎప్పుడైనా జరిగిందా? అన్నది ప్రశ్న.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. స్వతంత్ర్య భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలా ఆదివారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరగటం ఇది రెండోసారిగా చెబుతున్నారు. ఆదివారం మార్కెట్ పని చేస్తున్న సందర్భం తొలిసారి బీజేపీ నాయకత్వంలోని వాజ్ పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే చోటు చేసుకోవటం విశేషం. 1999 ఫిబ్రవరి 28న తొలిసారి ఆదివారం మార్కెట్లు పని చేశాయి. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హా ఉన్నారు. ఆ తర్వాత చూస్తే 2020 ఫిబ్రవరి 1 శనివారం వచ్చింది. దీంతో ఆ రోజు కూడా ట్రేడింగ్ నిర్వహించారు మళ్లీ ఈ రోజు ఆదివారం బడ్జెట్ ప్రవేవ పెడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పని చేయనుంది. దాదాపు 26 ఏళ్ల విరామం తర్వాత ఆదివారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరగటం ఒక అరుదైన అంశంగా చెప్పక తప్పదు.

ఇక.. కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వివిధ రంగాలపై ఆర్థిక మంత్రి పలు విధానాల్ని ప్రకటిస్తారన్న అంచనా నేపథ్యంలో మార్కెట్ల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగామారింది. రక్షణ.. ప్రజా రవాణా వంటి రంగాల్లో మూలధన వ్యయాల విషయంలో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకునే వీలుందన్న అంచనా వ్యక్తమవుతోంది. దీంతో ఆయా రంగాలకు చెందిన కంపెనీల ప్రభావితం అవుతాయంటున్నారు. మొత్తంగా ఈ రోజు బడ్జెట్ భవిష్యత్ భారత్ ను ఆవిష్కరిస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.