Begin typing your search above and press return to search.

సుప్రీం తాజా తీర్పుతో అనిల్ అంబానీకి భారీ దెబ్బ!

ఒకటి తర్వాత ఒకటి చొప్పున దెబ్బలు పడుతున్న అనిల్ అంబానీకి తాజాగా సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో కోలుకోలేనంత దెబ్బ పడింది

By:  Tupaki Desk   |   11 April 2024 4:40 AM GMT
సుప్రీం తాజా తీర్పుతో అనిల్ అంబానీకి భారీ దెబ్బ!
X

ఒకటి తర్వాత ఒకటి చొప్పున దెబ్బలు పడుతున్న అనిల్ అంబానీకి తాజాగా సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో కోలుకోలేనంత దెబ్బ పడింది. రూ.8 వేల కోట్లు చేతికి వచ్చే అవకాశం తాజాగా చేజారింది. అంతేకాదు.. సమీప భవిష్యత్తులో ఆయన కోలుకోవటం కష్టమన్న విషయంపై క్లారిటీ వచ్చిందన్న మాట వినిపిస్తోంది.

కొన్నేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన అనిల్ అంబానీ.. ఈ రోజున ఇలాంటి పరిస్థితికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని చెబుతారు. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్ అంబానీ.. ఆ తర్వాత ఆ జాబితాలో కనిపించకుండా పోవటం తర్వాత.. ఇప్పుడు ఆయన పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయేట్లుగా పరిస్థితులు మారాయి.

ఇంతకూ ఈ కేసేంటి? ఇందులో అనిల్ అంబానీకి ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? తదుపరి ప్రణాళిక ఏమిటన్నది చూస్తే.. 2008లో రిలయన్స్ ఇన్ ఫ్రాకు అనుబంధ కంపెనీగా ఉన్న డీఏఎంఈపీఎల్ (ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీఎంఆర్ సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్)లు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

అయితే.. తర్వాతి కాలంలో ఇదో వివాదంగా మారింది. 2017లో ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పు ప్రకారం ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్.. అనిల్ అంబానీ సంస్థకు రూ.2782.33 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. 2022 ఫిబ్రవరి 14 నాటికి ఒప్పంద నిబంధనల ప్రకారం ఈ మొత్తం రూ.8,009.38 కోట్లకు చేరింది. ఇందులో రూ.1678.42 కోట్లను డీఎంఆర్ సీ చెల్లించింది. మరో రూ.6330.96 కోట్లు చెల్లించాల్సి ఉంది.

అయితే.. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనిల్ అంబానీ మీద మరో పిడుగు పడేలా చేశాయి. దీని సారాంశం ఏమంటే.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పరేషన్ ఏమీ ఇవ్వాల్సింది లేదని తేల్చింది. దీంతో.. ఇప్పటికే చెల్లించిన రూ.1678.42 కోట్లను తిరిగి ఇవ్వాల్సి ఉంది. అంటే.. రావాల్సిన రూ.6.3 వేల కోట్లు రాకపోగా.. చేతికి వచ్చిన రూ.1.67వేల కోట్లను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. తాజా తీర్పుతో రిలయన్స్ ఇన్ ఫ్రా షేర్లు కనిష్ఠానికి పడిపోయాయి. బీఎస్ఈలో 19.99 శాతం నష్టపోయి రూ.227.4 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2250.02 కోట్లు కరిగిపోయి.. రూ.9008.02కోట్లకు చేరుకుంది. ఇప్పటికే కిందా మీదా పడుతున్న అనిల్ అంబానీకి తాజాగా తగిలిన దెబ్బ భారీదని చెప్పక తప్పదు.