Begin typing your search above and press return to search.

ఇండియాలో 'బార్బీ'పై 'ఓపెన్‌హైమ‌ర్' డామినేష‌న్?

By:  Tupaki Desk   |   24 July 2023 4:11 AM GMT
ఇండియాలో బార్బీపై ఓపెన్‌హైమ‌ర్ డామినేష‌న్?
X

హాలీవుడ్ నుంచి భారీ ఫ్రాంఛైజీ సినిమాలు భార‌త‌దేశంలో అత్యంత భారీగా విడుద‌లై అసాధార‌ణ‌ విజ‌యాలు సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అవెంజ‌ర్స్ సిరీస్ స‌హా చాలా మ‌ల్టీవ‌ర్శ్ సినిమాలు ఇండియా నుంచి వంద‌ కోట్ల వ‌సూళ్ల మార్కును అందుకోగ‌లిగాయి. కామెరూన్ అవ‌తార్ - అవ‌తార్ 2 అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇప్పుడు అదే కేట‌గిరీలో 'మిష‌న్ ఇంపాజిబుల్ 7 (డెడ్ రిక‌నింగ్ 1)' కూడా వంద కోట్ల క్ల‌బ్ లో చేరుతోంద‌ని రిపోర్ట్ అందింది. ఇప్ప‌టికే ఎంఐ7 దాదాపు 98కోట్లు వ‌సూలు చేసింది.

అయితే నాన్ ఫ్రాంఛైజీ చిత్రంగా విడుద‌లైన నోలాన్ 'ఓపెన్ హైమ‌ర్' ఇండియాలో భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ చిత్రం ఇప్ప‌టికే 50కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఓపెన్ హైమ‌ర్ ఒక బ‌యోపిక్ సినిమా అయినా భార‌త‌దేశంలో భారీ హైప్ తో విడుద‌లైంది. ఇండియాలోని మ‌ల్టీప్లెక్సుల నుంచి భారీ వ‌సూళ్ల‌ను తేగ‌లిగింది.

ఇక ఈ సినిమా క‌థానాయ‌కుడి జీవితానికి భ‌గ‌వ‌ద్గీత సెంటిమెంట్ జోడించ‌డం కూడా వ‌సూళ్ల‌కు క‌లిసి వ‌చ్చింద‌నేది ఒక విశ్లేష‌ణ‌. రాబర్ట్ ఒపెన్‌హైమర్ - ఎలిజబెత్ పగ్ పాత్ర‌ల న‌డుమ శృంగార‌ సన్నివేశం మధ్యలో భగవద్గీత పఠనం పై వివాదం చెల‌రేగ‌డం కూడా ఓపెన్ హైమ‌ర్ ప్ర‌చారానికి క‌లిసొచ్చింది.

ఇక ఈ సినిమాతో పాటు పోటీగా కొద్దిరోజుల గ్యాప్ తో విడుద‌లైన 'బార్బీ' ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద ఓపెన్ హైమ‌ర్ తో పోలిస్తే చాలా వెనుకబడిపోయింది. ప్ర‌ఖ్యాత సాక్ నిల్క్ విశ్లేష‌ణ ప్ర‌కారం...బార్బీ ఆదివారం చివరి నాటికి దాదాపు రూ. 18.58 కోట్ల నెట్ వసూలు చేస్తుందని అంచనా. గ‌త‌శుక్రవారం 5 కోట్ల భారీ ఓపెనింగు త‌ర్వాత వ‌సూళ్ల‌లో స్వల్ప మెరుగుద‌ల మాత్రమే క‌నిపించింది. అయితే ఓపెన్ హైమర్ మొదటి మూడు రోజులలో రోజుకు రూ. 17 కోట్ల వ‌సూళ్ల‌తో 3రోజుల్లో రూ. 49.25 కోట్ల (గ్రాస్) కలెక్షన్లు సాధించింది.

అయితే ఉత్త‌ర అమెరికాలో సీన్ మాత్రం రివ‌ర్సులో ఉంది. అక్క‌డ ఓపెన్ హైమ‌ర్ పై బార్బీ డామినేష‌న్ క‌నిపించింది. బార్బీ ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా వసూలు చేయగా.. ఓపెన్‌హైమర్ అంతర్జాతీయంగా 88.9 మిలియన్ డాల‌ర్ల‌తో ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా 165.9 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింద‌ని స‌మాచారం.

ఓవారాల్ గా వ‌ర‌ల్డ్ వైడ్ బార్బీ చిత్రం నోల‌న్ చిత్రం కంటే రెట్టింపు వ‌సూళ్లు సాధించింది. ఇక విదేశాల నుంచి బార్బీ వ‌సూళ్లు ప‌రిమితంగా మాత్ర‌మే ఉన్నాయి.

మ‌రో వైపు భార‌త‌దేశంలో టామ్ క్రూజ్ బ్లాక్ బస్టర్ 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రికనింగ్ - పార్ట్ వన్' మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. జూలై 21 వరకు రూ. 98.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను భార‌త‌దేశం నుంచి ఈ సినిమా సాధించింది. ఇటీవలి బాలీవుడ్ చిత్రాలు 'జరా హ‌త్ కే జ‌ర‌ బత్‌కే'.. 'స‌త్య ప్రేమ్ కి క‌థ‌' కంటే రేసులో ఎంఐ7 ముందుంద‌ని విశ్లేష‌కులు వెల్ల‌డించారు.