నిర్మాత చెప్పిన నగ్నసత్యాలు
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తూ, ఆ సంస్థలో తెరకెక్కే చిత్రాల ప్రొడక్షన్లో కీలక పాత్ర పోషించే వ్యక్తి.. చిరంజీవి అలియాస్ చెర్రీ.
By: Tupaki Desk | 2 May 2026 10:13 AM ISTటాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తూ, ఆ సంస్థలో తెరకెక్కే చిత్రాల ప్రొడక్షన్లో కీలక పాత్ర పోషించే వ్యక్తి.. చిరంజీవి అలియాస్ చెర్రీ. ఆయన సొంతంగా క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే, మత్తువదలరా-2, జెట్లీ చిత్రాలను కూడా ప్రొడ్యూస్ చేశారు.
‘జెట్లీ’ విడుదల నేపథ్యంలో మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న చెర్రీ.. మైత్రీ సంస్థలో వచ్చిన, రాబోయే సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఫౌజీ, డ్రాగన్ సినిమాల ప్రోగ్రెస్ గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. దీంతో పాటు మైత్రీ సంస్థ నుంచి గత ఏడాది వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిజల్ట్ గురించి చెర్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు తమకు పెద్ద షాక్ అని చెర్రీ తెలిపారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తమకు ఈ చిత్రం మంచి ఆదాయమే అందించినా.. థియేటర్ల నుంచి వచ్చిన కలెక్షన్లు చూసి మాత్రం తాము షాకయ్యామన్నడు చెర్రీ. మరీ అంత తక్కువ కలెక్షన్లు, షేర్ వస్తుందని తాము ఊహించలేదన్నాడు.
మైత్రీ సంస్థ నుంచి గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో అత్యంత పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అని.. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందనే అన్నారని.. కానీ ఈ మూవీ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు మాత్రం రాలేదని అతనన్నాడు. ఈ సినిమా ఫలితం చూసి తాము షాక్ అయిపోయాయని అన్నాడు చెర్రీ. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని.. పెద్ద హీరోల సినిమాలకు తప్ప చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లకు రావట్లేదని.. సినీ వినోదం కాస్ట్లీ అయిపోయిందని.. అందుకే ఇలాంటి సినిమాలను ఓటీటీలో చూసుకుందాం అనే భావనలోకి ప్రేక్షకులు వచ్చేశారని ఆయన అన్నారు.
ఆడియెన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోవడానికి ఓటీటీలు కూడా కారణమే అంటూనే.. థియేట్రికల్ రిలీజ్ కు, డిజిటల్ రిలీజ్ కు 8 వారాల గ్యాప్ ఉండాలన్న డిమాండ్ వర్కవుట్ కాదని చెర్రీ అన్నారు. ఈ డీల్ కు ఓటీటీలు రెడీనే అని, కానీ అందుకోసం రేట్ తగ్గిస్తారని.. మరి చిన్న సినిమాలకు అంత లాంగ్ థియేట్రికల్ రన్ ఉంటుందా, ఇలా రేట్ తగ్గితే నిర్మాతల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తమిళ నిర్మాతలు డిమాండు చేస్తున్నట్లు హీరోలు పారితోషకం కాకుండా లాభాల్లో వాటా ఇచ్చే పద్ధతి పట్ల చెర్రీ సానుకూలంగా స్పందించాడు. ఒక సినిమాకు సంబంధించి ఏదైనా అందరూ పంచుకోవాలని.. కానీ నష్టాలు మాత్రం నిర్మాతలు మాత్రమే భరించాలనడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు.
