బ్లాక్‌బస్టర్ సీక్వెల్స్.. పాత నెంబర్లను అందుకుంటాయా?
అక్టోబర్‌లో రెండు పెద్ద సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేయనున్నాయి. అక్టోబర్ 2న అజయ్ దేవగణ్ దృశ్యం: ది కన్‌క్లూజన్ విడుదలవుతుండగా, సరిగ్గా పదమూడు రోజుల తర్వాత అక్టోబర్ 15న రజినీకాంత్ జైలర్ 2 వస్తోంది.
By: Tupaki Desk | 2 Oct 2026 9:37 AM ISTఅక్టోబర్‌లో రెండు పెద్ద సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేయనున్నాయి. అక్టోబర్ 2న అజయ్ దేవగణ్ దృశ్యం: ది కన్‌క్లూజన్ విడుదలవుతుండగా, సరిగ్గా పదమూడు రోజుల తర్వాత అక్టోబర్ 15న రజినీకాంత్ జైలర్ 2 వస్తోంది. రెండింటికీ కొత్తగా ప్రేక్షకుడికి పరిచయం చేయాల్సిన కథలు కావు. మొదటి పార్ట్ చేసిన వసూళ్లే ఇప్పుడు ఈ సినిమాలపై అంచనాలను భారీగా పెంచేశాయి.
దృశ్యం 2 విషయానికి వస్తే.. 2022లో వచ్చిన ఆ సినిమా ఇండియాలో రూ.240.54 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.345.05 కోట్ల గ్రాస్ సాధించింది. మొదటి రోజు ఇండియాలో రూ.15.38 కోట్లతో మొదలైన సినిమా, మంచి టాక్‌తో లాంగ్ రన్‌లో అంత దూరం వెళ్లింది. ఇప్పుడు మూడో భాగానికి మొదటి రోజే గత సినిమా కంటే చాలా పెద్ద ఓపెనింగ్ కనిపించే పరిస్థితి ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కూడా అదే అర్థమవుతోంది. అక్టోబర్ 1 రాత్రి వరకు దృశ్యం: ది కన్‌క్లూజన్‌కు పలు రోజుల బుకింగ్స్ కలిపి రూ.50 కోట్లకు పైగా నమోదైనట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఈసారి రూ.345 కోట్ల పాత రికార్డును చేరుకోవడం కంటే, దాన్ని ఎంత దూరం దాటుతుందన్న లెక్క కూడా రావచ్చు. అయితే దృశ్యం సినిమాల బలం మొదటి రోజు కంటే కథలోని ట్విస్టులు, తర్వాత వచ్చే టాక్‌లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాక్ బాగుంటేనే ఈ రికార్డులు.
జైలర్ 2పై ఉన్న భారం మరో రేంజ్ లో ఉంది. మొదటి జైలర్ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి రజినీకాంత్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. నెల్సన్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, రజినీ పాత్రతో పాటు ఇతర స్టార్ల క్యామియోలు కూడా ఆ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు అదే ఫార్ములాను మళ్లీ వాడితే సరిపోదు. మొదటి భాగం ఇచ్చిన సర్‌ప్రైజ్ ఈసారి ముందే ప్రేక్షకుడికి తెలుసు.
జైలర్ 2కు మరో ప్లస్ మొదటి భాగంతో వచ్చిన మార్కెట్. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కేరళ, ఓవర్సీస్‌లో కూడా జైలర్ బాగా ఆడింది. అందుకే రెండో భాగం ఓపెనింగ్ మొదటి సినిమాను దాటే అవకాశాలు ఉండొచ్చు. కానీ రూ.600 కోట్లకు పైగా వెళ్లాలంటే మొదటి వీకెండ్ తర్వాత కూడా అన్ని మార్కెట్లలో అదే జోరు కొనసాగాలి. దృశ్యం మూడో భాగానికి ఇప్పటికే భారీ అడ్వాన్స్‌లు కనిపిస్తున్నాయి. జైలర్ 2కు మాత్రం అసలు బుకింగ్స్ మొదలయ్యాక రజినీ మార్కెట్ ఎంత పెరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది.
