Begin typing your search above and press return to search.

రూ.1000 కోట్ల క్లబ్ లోకి ధురంధర్.. 2025లో టాప్ ప్లేస్..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2025 3:25 PM IST
రూ.1000 కోట్ల క్లబ్ లోకి ధురంధర్.. 2025లో టాప్ ప్లేస్..
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఆ చిత్రం.. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తూనే ఉంది.

ఊహించని విజయం అందుకున్న ధురంధర్ మూవీ.. ఇప్పుడు అందరూ ఊహించినట్లుగానే అరుదైన ఫీట్ ను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.1006 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ క్లబ్ లోకి చేరిన తొమ్మిదో సినిమాగా ఘనత సాధించింది ధురంధర్.

అయితే ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లో బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు దంగల్‌, జవాన్‌, పఠాన్‌ ఉండగా.. ఇప్పుడు వాటి చెంతకు ధురంధర్ చేరింది. టాలీవుడ్ కౌంట్ తో సమం కూడా చేసింది. ఎందుకంటే.. ఇప్పటికే తెలుగు నుంచి నాలుగు (బాహుబలి-2, పుష్ప-2, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి 2898 ఏడీ) చిత్రాలు ఆ క్లబ్ లో ఉన్నాయి.

మరో విశేషమేమిటంటే.. ధురంధర్ కు రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతోనే సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ తో ప్రతిష్టాత్మక రూ.1000 కోట్ల క్లబ్‌ లో చేరిన మొదటి చిత్రంగా ధురంధర్ రికార్డు క్రియేట్ చేసింది. సినీ ఇండస్ట్రీలో అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

అదే సమయంలో ధురంధర్.. మరో రికార్డు క్రియేట్ చేసింది. 2025లో భారత్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. భారత్‌ లో ఇప్పటి వరకు రూ.668 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న వివిధ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసి మరిన్ని వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.

అయితే ధురంధర్‌ మూవీ 21వ రోజు రూ.26 కోట్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 4,753 థియేటర్‌లలో విజయవంతంగా రన్ అవుతోంది. అంతే కాదు.. అటు హీరో రణవీర్ సింగ్.. ఇటు డైరెక్టర్ ఆదిత్య ధర్ కెరీర్స్ లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. వారిద్దరిలో ఫుల్ జోష్ నింపింది ధురంధర్.

ఇక సినిమా విషయానికొస్తే.. రణవీర్ తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ రూపొందించారు. శాశ్వత్ సచ్‌ దేవ్ మ్యూజిక్ అందించారు.